T SAT | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 ( నమస్తే తెలంగాణ ): టీ శాట్‌లో పదేండ్లుగా ప్రొడక్షన్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు చేగొండి చంద్రశేఖర్‌ను టీ శాట్ యాజమాన్యం ఉద్యోగం నుం చి తొలిగించింది. ఆకస్మాత్తు నిర్ణయంపై ఆవేదనకు గురైన చంద్రశేఖర్ టీ శాట్ యాజమాన్యాన్ని సంప్రదించగా.. ‘మీదేం తప్పులేదు. మీ పనితీరు అద్భుతంగా ఉంది. మీరు చాలా ముఖ్యమైన అంశాలపై పనిచేశారు. కానీ మేం ఏం చేయలేకపోతున్నాం. సీఎంవో నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయాలని..” అని సమాధానమిచ్చారు. తన ఉద్యోగాన్ని తీసేయాలని సీఎంవో నుంచి ఫోన్లు రావడంపై చేగొండి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక, రాజకీయ అంశాలన్నింటిపై తన అభిప్రాయాలను సోషల్‌మీడియాలో ప్రజల ముందుంచేవాడినని.. నా పోస్టుల వెనక ఏ ఒక్క రాజకీయ పార్టీని విమర్శించిన దాఖలాలు లేవని.. నా వల్ల సీఎంవోకు వచ్చిన నష్టమేంటో తెలియడంలేదని వాపోయారు. తనను ఉద్యోగంలో నుంచి తీసేసి సీఎంవో చెప్పిన వారిని విధుల్లో చేర్చుకోవడం జరుగుతుందని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయనప్పుడు ఉద్యోగం నుంచి తీసేయడం సరికాదని ఆవేదన వ్యక్తంచేశారు. తిరిగి ఉద్యోగంలోకి తీసుకునే వరకు పోరాటం చేస్తానని చెప్పా రు. మంచి లక్ష్యంతో ఏర్పాటైన టీశాట్లాంటి సంస్థలో రాజకీయాలు ప్రవేశించడం ఏ ఉద్యోగికి మం చిది కాదనీ.. అందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చేగొండి చంద్రశేఖర్ సూచించారు. తన పోరాటానికి మద్దతు పలుకాలని ఆయన కోరారు.
ఉద్యమంలో కీలకం.. అందుకే ఉద్యోగం..!
తెలంగాణ ఉద్యమంలో చేగొండిది కీలకపాత్ర. హైదరాబాద్ నడిబొడ్డుపై సమైక్యాంధ్ర సభలు జరుగుతున్న ప్రతీ సందర్భంలో అక్కడికి వెళ్లి జై తెలంగాణ నినాదాలు చేస్తూ వాళ్లతో విచక్షణారహితంగా దాడికి గురైనవ్యక్తి. ఓ దశలో అతడిపై సమైక్యాంధ్ర వ్యక్తులు రక్తమొచ్చేటట్టు దాడి చేస్తే చావు అంచుల వరకు వెళ్లారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ ఉద్యమ కార్యాచరణలోనూ ఆయన పాల్గొన్నారు. సోషల్ మీడియాలో అతడికి వేలాదిమంది ఫాలోవర్స్ ఉన్నారు. దావత్ వితౌట్ దారు ఏర్పాటు చేసి తాగుడు మానెయ్యాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. పీజీ గ్రాడ్యుయేట్…డిజిటల్ మీడియాలోనూ కంటెంట్ క్రియేటర్‌గా అనుభవం ఉంది. ఈ గుర్తింపుతోనే 2014లో టీ శాట్ యాజమాన్యం అతడిని ప్రొడక్షన్ మేనేజర్‌గా విధుల్లోకి తీసుకున్నది. వందలాది సామాజిక అవగాహన కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మానసికపరమైన అంశాలపై మనస్తత్వ నిపుణులతో సుమారు 450కి పైగా టీశాట్‌లో ప్రోగ్రాంలు నిర్వహించారు. ఇప్పుడు ఆయనను విధుల నుంచి తప్పించడంతో చేగొండికి మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు చేస్తుండటం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి ఇదేం పైశాచికత్వం అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.