హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ మహిళల్లో పోషకాహార లోప నివా రణకు అటవీ ఉత్పత్తులు దోహదం చేస్తున్నాయని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అధ్యయనంలో వెల్లడైంది. ఐఎస్బీ నేతృత్వంలో సౌత్ డకోటాస్టేట్ యూనివర్సిటీ (యూఎస్ఏ), హంబోల్ట్ విశ్వవిద్యాలయం (జర్మనీ), మిచిగాన్ వర్సిటీ (యూఎస్ఏ), మాంచెస్టర్ వర్సిటీ (యూకే), యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్ (డెన్మార్క్)కు చెందిన పరిశోధకులు అధ్యయనం సాగించారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఆదివాసీలు అధికంగా ఉన్న రెండు జిల్లాల్లో 570 గృహాల నుంచి డైట్ రీకాల్పై డాటాను సేకరించారు. వారి అధ్యయనం ప్రకారం 40% ఆదివాసీ మహిళలు ఏడాదిలో కనీస ఆహార వైవిధ్యాన్ని ఎన్నడూ అందుకోలేదని తేలింది. వీరికి పోషకాహారం అందించేందుకు అడవుల నుంచి సేకరించిన ఆహారం దోహదపడుతుందని ఐఎస్బీ ప్రొఫెసర్ అశ్విని ఛత్రే వెల్లడించారు.