హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): యోగాతో టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. టైప్-2 డయాబెటిస్ 40 శాతం తగ్గిస్తుందని పేర్కొంది. ఈ మేరకు రిసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిక్స్ ఇన్ ఇండియా (ఆర్ఎస్ఎస్డీఐ) రూపొందించిన అధ్యయన నివేదికను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు అందించారు. ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్గా హెడ్‌గా ఉన్న ఎస్వీ మధు నేతృత్వంలో ఈ రిపోర్టును తయారు చేశారు.
మధుమేహం రావడానికి హైరిస్క్ ఉన్న వ్యక్తుల్లో ఆ ముప్పును యోగాతో తగ్గించుకోవచ్చని నివేదిక తెలిపింది. పురాతన సంప్రదాయ యోగా శాస్త్రీయ పద్ధతుల్లో ఆరోగ్య సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుందో వెల్లడించింది. క్రమం తప్పకుండా యోగా చేసే వారిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఒత్తిడి, కార్టిసాల్ లెవల్స్, జీవక్రియ సమతుల్యత ఉన్నట్టు తేల్చింది.