నలుగురు స్నేహితులు కలిసి దావత్ చేసుకుందామని రూ.వేలు పోసి ఖరీదైన స్కాచ్ బాటిల్ కొన్నారు. సీల్ ఓపెన్ చేసి, మూత విప్పి ఒక పెగ్గు పోసుకొన్నారు. ఒక్క బుక్క తాగగానే చీప్ లిక్కర్ మాదిరిగా వాసన, ఘాటు రావడంతో అవాక్కయ్యారు. వాళ్లకే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది మందుబాబులకు ఎదురవుతున్న అనుభవం ఇది.
ఖరీదైన బాటిల్ సీల్ వేసినట్టే ఉంటున్నదని, లోపల మందు మాత్రం చీప్ లిక్కర్ వాసన వస్తున్నదని, ఒకటి రెండు పెగ్గులకే రప్పున తలకెక్కుతున్నదని ఎంతో మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదంతా కల్తీ మద్యం మహిమ అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం ఎడాపెడా బెల్టు దుకాణాలను ప్రోత్సహించి, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేయిస్తుండటంతో లిక్కర్ సిండికేట్ చేతివాటం మొదలు పెట్టింది.
అధికారపక్షం నేతల ఆశీస్సులతో కల్తీ మద్యం దిగుమతి చేసి యథేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కల్తీ మద్యాన్ని నియంత్రించాల్సిన ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం గంజాయి, సారాయి అంటూ ధూల్పేటకే పరిమితమైనదని విమర్శిస్తున్నారు.
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఖరీదైన సాచ్ బాటిళ్లతోపాటు, రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన మద్యంలో కల్తీ జరుగుతున్నట్టు మందుబాబులు ఆరోపిస్తున్నారు. విదేశీ మద్యం బ్రాండ్లలో ఈ తరహా కల్తీ ఎక్కువగా జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్కాచ్ బాటిళ్లలో స్కాచ్ తీసేసి చీప్ లికర్, మీడియం లిక్కర్‌తో నింపుతున్నారని ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రీమియం బ్రాండ్లకు చెందిన మద్యం సీసాల్లో స్పిరిట్, చీప్ లిక్కర్‌తో నింపి విక్రయిస్తున్నట్టు మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి నకిలీ మద్యాన్ని నిరోధించడానికి ఎక్సైజ్ శాఖ హెడ్సీవ్ లేబుల్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. క్యూర్ కోడ్, బార్ కోడ్ ఉండే లేబుల్స్‌ను మద్యం బాటిల్ మూతల మీద అతికిస్తున్నారు. దీన్ని సులభంగా డీకోడ్ చేసి, ఆ మద్యం సీసా అసలుదా? నకిలీదా? అని గుర్తించవచ్చు. అయితే మద్యం సిండికేట్ నేర్పుగా సీల్ వేసి ఉన్న బాటిళ్లలోనే కల్తీ చేస్తున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మోసాలు బెల్టు దుకాణాలు, బార్లలో ఎక్కువ జరుగుతున్నట్టు పేర్కొంటున్నారు.
కల్తీ ఎలా జరుగుతున్నదంటే
కొన్ని మద్యం దుకాణాల్లో రాత్రి మూసేసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా కల్తీ వ్యవహారం నడిపిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక ఎక్సైజ్ అధికారి తన అనుభవంలో చెప్పిన వివరాల ప్రకారం.. మూడు ఇంచుల పరిమాణంలో ఉండే కనెక్టర్ (స్రూ డ్రైవర్ వంటిది) అనే చిన్న పరికరంతో సీసా మూతను తీస్తున్నారట. హెడ్ సీవ్ లేబుల్ ఏమాత్రం చిరిగిపోకుండా నేర్పుగా మూతలు తీస్తారని తెలిపారు. ఒకో బాటిల్ నుంచి మద్యం తీసి, దాని స్థానంలో నీరు, స్పిరిట్, చీప్ లిక్కర్, మీడియం లిక్కర్.. ఇలా సీసా బ్రాండును బట్టి ఏది సరిగా కలిసిపోతుందో దానిని కలుపుతున్నారట. ఆ తర్వాత తిరిగి యథాతథంగా మూతను బిగిస్తున్నారట. ఇందుకోసం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదిరత రాష్ర్టాల నుంచి నేర్పరులను రప్పిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. వారికి రోజూ రూ.5 వేల వరకు భత్యం ఉంటుందని, భోజన ఖర్చులు కూడా దళారులే పెట్టుకుంటున్నారని పేర్కొన్నాయి. క్వార్టర్ బాటిల్లో 180 మిల్లీలీటర్ల మద్యం ఉంటుంది. ఇందులోంచి 60 ఎంఎల్ మద్యం తీసేసి, అంతే మొత్తంలో స్పిరిట్ కలుపుతున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం లీటర్ స్పిరిట్‌కు రూ.500 ఉన్నది. లీటర్ స్పిరిట్‌లో రెండు లీటర్ల నీళ్లు కలుపుతారట. ఈ లెక్కన రూ.500 ఖర్చుతో 19 క్వార్టర్ల లిక్కర్‌ను కల్తీ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా రూ.4370 వ్యాపారం జరుగుతుందన్నమాట. బహిరంగ మార్కెట్లో స్పిరిట్‌పై నిషేధం ఉండడంతో ప రిశ్రమల నుంచి సేకరిస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ నేత బార్ అండ్ రెస్టారెంట్లో గత నెల రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని ఓ బార్ మీద ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఖరీదైన మద్యం బాటిళ్లలో చౌక మద్యాన్ని కలుపుతూ కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, పునీత్ పట్నాయక్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఓ యూత్ కాంగ్రెస్ నాయకుడిదిగా సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సదరు బార్‌కు నిర్వాహకులు లైసెన్స్ రెన్యువల్ కూడా చేయించలేదని విచారణలో తేలింది.
విచ్చలవిడిగా కల్తీ గ్యాంగులు
ఖరీదైన మద్యం సీసాల్లో కల్తీ మద్యం నింపి విందులు, వినోదాలకు సరఫరా చే స్తున్న ఓ ముఠాను శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు మే నెలలో పట్టుకున్నారు. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ మద్యం నింపి, ఢిల్లీ మద్యం పేరుతో మారెట్ ధరల కంటే తకువకు విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. విందులకు ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తుంటారని విచారణలో తేలింది. కాటేదాన్ ప్రాంతంలో జరుగుతున్న ఓ ఫంక్షన్‌కు ఈ ముఠా మద్యం సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని, కారులో బ్లాక్ లేబుల్ మ ద్యం బాటిళ్లను తరలించగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నగరంలో విచ్చలవిడిగా మద్యం కల్తీ గ్యాంగులు తయారయ్యాయని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటుకు ఫిర్యాదులు అందుతున్నాయి.