హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దాదాపు ఏడాది కాలంగా కాగితాలకే పరిమితమైన హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) ప్రాజెక్టు ఈసారైనా పట్టాలెక్కుతుందా? అని సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇంతకాలం టెండర్లలో పాల్గొనలేదు. దీంతో కాంట్రాక్టర్లకు నేరుగా రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ద్వారా బిల్లులు చెలించేలా ప్రభుత్వం ఇటీవల నిబంధనల్లో మార్పులు చేసింది. తద్వారా కాంట్రాక్టర్లకు కొంత భరోసా కలిగినప్పటికీ ఆర్బీఐ ద్వారా ప్రభుత్వం చెల్లింపులు జరపడం సాధ్యమవుతుందా? అని అనుమానిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ.11,399 కోట్లతో 5,824 కి.మీ. ఆర్అండ్బీ రోడ్లను, మరో రూ.6,294 కోట్లతో 7,449 కి.మీ. పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిరుడు నవంబర్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లను ఆహ్వానించింది.
కానీ, ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందో, లేదో అనే అనుమానంతో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనలేదు. దీంతో ప్రభుత్వం మూడుసార్లు టెండర్ల గడువు పొడిగించింది. అయినా ఫలితం లేకపోవడంతో బిల్లుల చెల్లింపుపై కాంట్రాక్టర్లలో భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవల ఏజెన్సీల నెట్వర్త్ను 20 నుంచి 15 శాతానికి కుదించడంతోపాటు హ్యామ్ నిబంధనల్లో మార్పులు చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వం డెడికేటెడ్ డెట్ మెకానిజం (డీడీఎం) పద్ధతిలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తుంది. ముందుగా ఆర్అండ్బీ శాఖ ద్వారా, ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ ద్వారా చెల్లింపులు చేస్తారు. ఒకవేళ ఈ శాఖలు చెల్లించకపోతే పేమెంట్ సెక్యూరిటీ ఫండ్ (పీఎస్ఎఫ్) నుంచి చెల్లింపులు జరుపుతారు. అయినా చెల్లింపులు జరుగనిపక్షంలో నేరుగా రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ద్వారా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ పద్ధతిలో కాంట్రాక్టర్లకు ఆర్బీఐ బిల్లులు చెల్లించి, ఆ తర్వాత రాష్ర్టానికి రావాల్సిన నిధుల నుంచి సర్దుబాటు చేస్తుంది.
ఆర్బీఐ ద్వారా చెల్లింపులు ఏమేరకు సాధ్యం?
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా, పీఎస్ఎఫ్ ద్వారా చెల్లింపులు జరగవని, ఆర్బీఐ ద్వారా చెల్లింపులు జరపడం ఏ మేరకు సాధ్యమని, అందుకు నిబంధనలు అనుమతిస్తాయా అని కాంట్రాక్టర్లు శంకిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆర్బీఐ ద్వారా చెల్లింపులు చేసే వీలున్నప్పటికీ భవిష్యత్తులో ప్రభుత్వమే అత్యవసర పనుల పేరుతోనో, లేక మరేదైనా కారణంతోనే ఆర్బీఐ ద్వారా చెల్లింపులు నిలిపివేయించే అవకాశం కూడా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధుల కంటే చెల్లించాల్సిన బిల్లులు ఎక్కువగా ఉన్న పక్షంలో తమకు ఇబ్బందులు తప్పవని, అటువంటి పరిస్థితుల్లో తాము న్యాయపోరాటం చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదని జంకుతున్నారు.
పూర్తి భరోసా కలిగితేనే పనులు
హ్యామ్ విధానంలో కాంట్రాక్టర్లు రహదారులను నిర్మించడమే కాకుండా వాటి నిర్వహణ బాధ్యతలు కూడా చూడాల్సి ఉంటుంది. ఈ విధానంలో ప్రభుత్వం కొంత మొత్తాన్ని నిర్మాణ దశలో, మిగతా మొత్తాన్ని నిర్మాణం పూర్తయ్యాక విడతలవారీగా చెల్లిస్తుంది. మొత్తంగా పనులు జరిగే వరకు ప్రభుత్వం 40%, కాంట్రాక్టర్లు 60% భరించాల్సి ఉంటుంది. కానీ, ఈ పద్ధతిలో తాము నిధులు ఖర్చుచేసి, రహదారులు నిర్మించాక ప్రభుత్వం చెల్లింపులు జరుపకపోతే తమ పరిస్థితి ఏమవుతుందోనన్న భయంతో కాంట్రాక్టర్లు ఇంతకాలం టెండర్లలో పాల్గొనలేదు. అనంతరం ప్రభుత్వం నిబంధనలను సవరించడంతో ఇప్పుడు కాంట్రాక్టర్లలో చర్చ మొదలైంది.
ఆర్బీఐ ద్వారా బిల్లుల చెల్లింపులకు ఎలాంటి ఢోకా ఉండదని పూర్తిస్థాయిలో భరోసా లభిస్తేనే తాము పనులు చేపట్టగలమని, లేకుంటే ఆ పనులు తమకు అవసరంలేదని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దీనిపై తాజాగా ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ.. హ్యామ్ ప్రాజెక్టును కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, దీనిపై త్వరలో సీఎంను కలిసి చర్చించనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)కు అనుసంధానంగా గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేస్తామని, తద్వారా తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.