Driverless tractor | హనుమకొండ సబర్బన్, మే 20: రోజురోజుకూ మారిపోతున్న సాంకేతికతతో వ్యవసాయరంగంలోనూ అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎద్దు, నాగలినే నమ్ముకొన్న రైతులు.. నేడు ట్రాక్టర్ లేకుండా వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చింది. తాజాగా డ్రైవర్ లేకుండానే నడిచే ట్రాక్టర్ల ఆవిష్కరణ కోసం ప్రపంచవ్యాప్తంగా జోరుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అంశంలో మన కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కిట్స్) పరిశోధకులు అందరికంటే ఓ అడుగు ముందే ఉన్నారు. అతి తక్కువ ఖర్చుతో సాధారణ ట్రాక్టర్‌నే డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌గా మార్చే సాంకేతికత పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, విజయవంతంగా పరీక్షించి ఔరా అనిపించారు.
అతి తక్కువ ఖర్చుతోనే..
అమెరికా, యూరప్ ఖండాల్లో ఇప్పటికే కొన్ని సంస్థలు డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లను ఆవిష్కరించాయి. కానీ, వాటి ధర కోట్ల రూపాయలు ఉంటుంది. ఎకరం.. రెండెకరాల భూమి ఉన్న రైతులు వాటిని వాడుకోలేరు కూడా. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని కిట్స్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు పీ నిరంజన్‌రెడ్డి, వాసిం కలిసి రెండేండ్లపాటు శ్రమించి అతి తక్కువ ఖర్చుతో డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించారు. 2019లో నేషనల్ డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వీరి పరిశోధన ప్రతిపాదనను స్మార్ట్ అగ్రికల్చర్ పేరిట సమర్పించారు. జాతీయ సాంకేతిక బృందం ఆ ప్రతిపాదనను పరిశీలించి 2020 ఫిబ్రవరిలో పరిశోధన కోసం రూ.41 లక్షలు మంజూరు చేసింది. దీంతో పరిశోధన మొదలుపెట్టిన వీరు.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికత ఆధారంగా డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించారు. డైవర్ లేకుండానే దుక్కి దున్నే ప్రక్రియను విజయవంతంగా చేసి చూపించారు.
యాప్ ద్వారా ఈ ట్రాక్టర్ నడుస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించారు. సెల్‌ఫోన్ నుంచి క్లౌడ్‌కు అక్కడ నుంచి ట్రాక్టర్ ఎలాపని చేయాలో నిర్దేశిస్తూ ఐవోటికి సిగ్నల్స్ వెళ్తాయి. రైతు ఎంత దూరంలో ఉన్నప్పటికీ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్టర్ ఎటువైపు వెళ్లాలనేది నిర్దేశించుకొని నడుస్తుంది. దుక్కి ఎంతలోతు పడాలనేదీ సెల్ ఫోన్ ద్వారానే నిర్దేశించవచ్చు. పొలం వద్ద 2జీ సిగ్నల్ ఉన్నా విజయవంతంగా దుక్కి దున్నుకోవచ్చు. ఐవోటీకి సంబంధించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ట్రాక్టర్ ఆపరేటింగ్ సిస్టం మొత్తం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. దాని ఆధారంగా ట్రాక్టర్‌ను ముందుకు వెనకకు, రెండు పక్కలకు తిప్పుకోవచ్చు.
చదువురాని రైతులు కూడా ఈ సాంకేతికతను వినియోగించి భూములను దున్నుకోవచ్చు. ఐవోటీ కిట్‌ను అమర్చడానికి రూ.20 వేలు ఖర్చవుతుంది. డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ఇప్పటికే ఐదు దశల ఫీల్డ్ టెస్టులు పూర్తయ్యాయి. మరో రెండు ఫీల్డ్ టెస్టులు పూర్తి చేయాల్సి ఉన్నది. ట్రాక్ట్ రివర్స్ గేర్ పనితీరుతోపాటు, దున్నే దుక్కి విస్తీర్ణాన్ని జియో ఫెన్సింగ్ చేయడం వంటి ప్రక్రియలు మిగిలాయి. మరో మూడు నెలల్లో ఈ దశలు పూర్తి చేసి డ్రైవర్ లేని ట్రాక్టరును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నట్టు కిట్స్ కాలేజీ యాజమాన్యం తెలిపింది. కిట్స్ కాలేజీ ప్రొఫెసర్ల ప్రయత్నాన్ని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల క్యాంపస్‌కు వచ్చి అభినందించారు.
రైతులకు మేలు జరుగుతుంది
మా ప్రొఫెసర్లు డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్‌ను రూపొంచడం గర్వంగా ఉన్నది. దీని వల్ల భవిష్యత్తులో రైతులకు మేలు జరుగుతుంది. మ్యాన్ పవర్ కొరత తీవ్రంగా ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి ఈ ఆవిష్కరణ ఎంతో దోహదపడుతుంది. సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మా క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రారంభించారు. విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తున్నది.
– కొమాళ్ల అశోక్‌రెడ్డి, కిట్స్ కాలేజీ ప్రిన్సిపాల్
మాకు అండగా కాలేజీ యాజమాన్యం
డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్‌ను రూపొందించాలని నేను, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ వాసిం పని మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు కాలేజీ యాజమాన్యం మాకు ఎంతో అండగా నిలిచింది. మా ప్రయత్నాన్ని మంత్రి కేటీఆర్ ప్రశంసించడం గర్వంగా ఉన్నది. సాధ్యమైనంత త్వరగా ఆవిష్కరణను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
– పొలాల నిరంజన్‌రెడ్డి, ప్రొఫెసర్