హైదరాబాద్, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టును కట్టితీరుతామని ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఢంకా బజాయించి చెప్తుంటే, మరోవైపు రేవంత్ మాత్రం ఆ ప్రాజెక్టు ఊసెత్తకుండా ప్రసంగం ముగించారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు వ్యూహాత్మాకంగా ముందుకు వెళ్తున్నట్టు దీనిని బట్టి స్పష్టమవుతున్నది. ‘నువ్వు కొట్టినట్టు చేయి.. నేడు ఏడ్చినట్టు నటిస్తా’ అన్న చందంగా ఇద్దరు సీఎంల వ్యవహార శైలి కనబడుతున్నది. అందుకు తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇరువురు సీఎంలు చేసిన ప్రసంగాలు నిదర్శనం. ఏపీలో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బనకచర్ల అంశాన్ని పావుగా వాడుకుంటున్నారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి వేదికగా చేసిన ప్రసంగంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వరదతో వచ్చే కష్టాలు, నష్టాలు భరించాలి. కానీ వరద నీటితో ప్రయోజనం పొందవద్దంటే ఎలా? రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృథా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లి స్తాం. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తాం. బనకచర్ల ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతం చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ మరోసారి దబాయింపులకు దిగారు. ప్రాజెక్టును కట్టితీరుతామని చెప్పారు. ప్రాజెక్టుపై శపథాలు చేశారు.
బనకచర్ల ఊసెత్తని రేవంత్రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం అనంతరం కొద్దిసేపటికే గోల్కొండ కోట వేదికగా రేవంత్రెడ్డి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసంగించారు. “తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యం, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోం’ అని ప్రకటించారే తప్ప ఎక్కడా బనకచర్ల ప్రాజెక్టు పేరు ఎత్తలేదు. గతంలో బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని, కమిటీలు వేసి సమస్యను పరిష్కరిస్తామని హడావుడి చేసిన రేవంత్రెడ్డి తాజా ప్రసంగంలో ఎక్కడా వాటిని ఉటంకించలేదు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడే విషయంలో తమ వద్ద ఉన్న వ్యూహాత్మక ప్రణాళిక ఏమిటో వెల్లడించలేదు.
బనకచర్ల అంశంపై అసలు రేవంత్ తన ప్రసంగంలో ఒక్క మాట మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. బనకచర్ల కట్టి తీరతామని చంద్రబాబు స్పష్టంగా తేల్చి చెప్తున్నా, రేవంత్రెడ్డి అంతే ధీటుగా అడ్డుకుని తీరుతామని ప్రకటించని దుస్థితి నెలకొన్నది. నీటి వాటాలు తేలకుండానే బనకచర్ల కట్టి తీరుతాం అని చంద్రబాబు, లోకేశ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నా రేవంత్రెడ్డి కనీసం వారి పేర్లను ఉచ్చరించడానికి సైతం భయపడుతున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్రెడ్డి కేవలం పొలిటికల్ స్టేట్మెంట్లకు పరిమితం కావడం తప్ప కేంద్రాన్ని గట్టిగా నిలదీసింది లేదనే చర్చ నడుస్తున్నది. చంద్రబాబు బనకచర్లపై ఇన్ని మాట్లాడుతున్నా రేవంత్రెడ్డి మాత్రం తన గురువును పల్లెత్తు మాట అనడం లేదంటేనే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చీకటి ఒప్పందం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్
గోదావరి మిగులు జలాలను కృష్ణా మీదుగా పెన్నా బేసిన్లోని రాయలసీమ ప్రాంతానికి తరలించి సాగు, తాగునీరు అందిస్తామని, పారిశ్రామిక అవసరాలు తీరుస్తామని, పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ అని చంద్రబాబు అనేక వేదికలపై చెప్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టును మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ ప్రయోజనాలను సీఎం రేవంత్రెడ్డి ఏపీకి తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తున్నది. ఏపీ ఆలోచనాపరుల వేదిక సైతం ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసమే అని వాదిస్తున్నది. రూ.80 వేల కోట్లతో ప్రాజెక్టు రూపొందించినా పూర్తయ్యే నాటికి దీని వ్యయం రూ.1.5 లక్షల కోట్లకు చేరుతుందని చెప్తున్నారు. అయినా బనకచర్లపై చంద్రబాబు తగ్గడం లేదు. రేవంత్, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉదాసీనత వైఖరి చంద్రబాబు దూకుడుకు కారణమవుతున్నది. మరోవైపు ఎన్డీయేలో చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తుండటంతో కేంద్రం ఎలాగూ తనకు మద్దతుగా ఉంటుందని చంద్రబాబు ఈ ప్రాజెక్టు విషయంలో మొండిగా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్రెడ్డి మాత్రం తెలంగాణ ప్రయోజనాలను తన రాజకీయ గురువు చంద్రబాబు కోసం తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడం ఆందోళన కలిగిస్తున్నది.