హైదరాబాద్, జులై 3(నమస్తే తెలంగాణ): ‘వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు..’ ఈ సామెత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. గతంలో తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు చేసి అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నించిన ఆయన ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘అబ్బే.. నేను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు. వాటికి వ్యతిరేకంగా మాట్లాడలేదు’ అని చెప్పుకొస్తున్నారు.
గురువారం ఆయన కుప్పంలో మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. గోదావరిలోని మిగు లు జలాలను వాడుకుంటే ఇబ్బంది ఏమిటంటూ మరోసారి బనకచర్ల నిర్మాణాన్ని సమర్థించుకున్నారు. సముద్రంలోకి వెళ్లే నీళ్లలో చెరో 200 టీఎంసీలను రెండు రాష్ర్టాలు వాడుకుంటే రెండు రాష్ర్టాలు బాగుంటాయని ఉచిత సలహా ఇచ్చారు. తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుందని, నీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రాజెక్టులపై తాను చిమ్మిన విషం చంద్రబాబు మర్చిపోయారేమో గానీ, దెబ్బతిన్న తాము మాత్రం మర్చిపోలేదని స్పష్టంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని కాళేశ్వరం, పాలమూరు, డిండి ప్రాజెక్టులపై విషం చిమ్మిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో సాగునీటి గోస తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని కుట్రలు చేశావో మర్చిపోయావా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) కసరత్తు చేస్తున్నది. త్వరలోనే ఇరురాష్ర్టాలతో సమావేశాన్ని నిర్వహించి ప్రాజెక్టు అంశాలపై చర్చించాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.