హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన హామీల అమలు కోసం ఈనెల 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఛలో రాజ్‌భవన్ కు రైతులు భారీగా తరలిరావాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఛలో రాజ్‌భవన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
నాయకులు సాగర్, పశ్యపద్మ, ఉపేందర్‌రెడ్డి మండల వెంకన్న మాట్లాడుతూ చారిత్రక రైతు పోరాటానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర గవర్నర్లకు సమస్యలతో కూడిన మెమోరాండాలను అందిస్తామన్నారు. నాడు రైతు ఆందోళనకు స్పందించిన ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకిచ్చిన హామీలను అమలు కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న రాజ్భవన్ల ఎదుట ఆందోళనలు, వినతిపత్రాల సమర్పణ చేపట్టనున్నామని పేర్కొన్నారు.
రైతాంగం పండించిన పంటలకు కనీస మద్ధతు ధరల కోసం పార్లమెంటులో చట్టం చేయాలని, స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం సీ 2050 అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి ఉన్న రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని, రుణ విమోచన చట్టం తేవాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించు కోవాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సవరించి అమలు చేయాలని కోరారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.