జమ్మికుంట, జనవరి 5: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గం బలనిరూపణకు ఈ నెల 25న అవిశ్వాసం తీర్మానానికి కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. చైర్మన్ రాజేశ్వర్రావుపై 23వ వార్డు కౌన్సిలర్ మల్లయ్య అవిశ్వాస తీర్మానానికి తెరతీసిన విషయం తెలిసిందే. కౌన్సిల్లో ఇరు వర్గాలకు చెరో 15 మంది సభ్యులు మాత్రమే ఉండటంతో పాలకవర్గం ఎన్నికకు ఎక్స్ అఫీషియో సభ్యుడి మద్దతు కీలకం అయింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇటీవల ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తన పేరు నమోదు చేయాలని కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో మున్సిపల్ పాలకవర్గం సాధారణ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయింది. చైర్మన్వర్గం హైదరాబాద్ క్యాంపు నుంచి జమ్మికుంటకు వచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణ సీఐ రమేశ్, ఎస్సైలు శ్రీధర్, రాజేశ్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు చేపట్టారు. దాదాపు 5 గంటల పాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో కలెక్టర్.. కౌన్సిల్ సభ్యుడిగా ఎమ్మెల్యేకు ఆమోదం తెలిపినట్టు చైర్మన్ వర్గానికి సమాచారం వచ్చింది. దీంతో మున్సిపల్ సమావేశం రద్దయింది. చైర్మన్ వర్గం మళ్లీ హైదరాబాద్ క్యాంపునకు తరలివెళ్లింది. ఎక్స్ అఫీషియో సభ్యుడి మద్దతుతో చైర్మన్‌కు 16 మంది సభ్యులున్నారు. దీంతో.. ఈ నెల 25న జరుగనున్న బలనిరూపణలో వందశాతం తామే గెలుస్తామని, గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు.