హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ చానల్ క్యూ న్యూస్‌లో పోల్ పేరిట మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై బాడీ షేమింగ్‌కు పాల్పడటం దుర్మార్గమైనదని మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. యూట్యూబ్ చానల్ పేరిట వాడుతున్న భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైనదని, జర్నలిస్టుల పేరిట, పత్రిక స్వేచ్ఛ పేరుతో వాడుతున్న భాషను రాజకీయ విధానాల మీద కాకుండా కుటుంబసభ్యులను వివాదాలకు లాగుతున్న ప్రయత్నాలను మీడియా అకాడమీ చైర్మన్‌గా ఖండిస్తున్నానని తెలిపారు. ‘ఇది జర్నలిజం భాష కాదు. ఈ భాష జర్నలిస్టులు వాడదగిదని కాదు. పత్రిక స్వేచ్ఛ పేరిట ఇదొక అన్యాయమైన, అప్రజాస్వామిక చర్య’ అని ఆయన పేర్కొన్నారు. ఇది దుర్మార్గమని, యూట్యూబ్ చానళ్ల పేరిట సోషల్ మీడియాలో చలామణి అవుతున్న చాలామంది ప్రాథమికంగా జర్నలిస్టులు కాదని, ఇది విద్వేష పూరితమైన ప్రాయోజిత ప్రచారంలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నానని వెల్లడించారు. టీయూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, టెమ్జ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు.