హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ): ఆగస్టులో శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నదని, రానున్న మండలి సమావేశాలను పాత అసెంబ్లీ భవనంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. దీనిని దృష్టి లో ఉంచుకొని ఆగస్టు 15లోగా శాసనమండలి పునర్నిర్మాణ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం శాసనసభ ప్రాంగణంలో ఆర్అండ్బీ అధికారులతోపాటు ఆగాఖాన్ సంస్థ ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత శాసనసభ భవనం పునర్నిర్మాణ పనుల పురోగతిపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్టు తెలిపారు. జాప్యానికి తావులేకుండా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సమావేశంలో ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, సీఎం కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.