హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజురోజుకూ బరితెగిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడమే పనిగా పెట్టుకున్నదని ఆగ్రహించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ బీజేపీకి వ్యతిరేకమైన కూటమిలో ఉన్నందుకే అనర్హుడిగా ప్రకటించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఉన్నందుకే జగన్పై ఎన్ని కేసులు ఉన్నా.. సుదీర్ఘకాలంగా బెయిల్పై ఉంటున్నా ఏమీ అనడం లేదన్నారు. ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడం అత్యంత దుర్మార్గమని ధ్వజమెత్తారు. కేసులు ఉన్న బీజేపీ ఎంపీలను అరెస్టు చేస్తారా? దేశంలోనే నంబర్-1 క్రిమినల్ హోంమంత్రి అమిత్ షాను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. ఒకవైపు ఆదివాసీ మహిళలను రాష్ట్రపతి చేసి, ఇంకోవైపు ఆదివాసీల ప్రభుత్వాన్ని కూలదోస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చే సబ్సిడీలను ఉచితాలు అనడం సరికాదన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసే వ్యాఖ్యల వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఢిల్లీ పెద్దల డైరెక్షన్ ఉన్నదని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా రాక ముందే బీజేపీ హద్దులు మీరి వ్యవహరిస్తున్నదని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా, అప్రజాస్వామ్యంగా ఉంటున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని ఖండించారు. అనంతరం వచ్చే నెల 4 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే సీపీఐ రాష్ట్ర మూడో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.