హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గవర్నర్ తమిళిసై బీజేపీ నాయకురాలి మాదిరిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి గురించి గవర్నర్ వ్యాఖ్యానించడం సమంజసం కాదని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ర్టాల్లో మాదిరిగానే తెలంగాణలోనూ గవర్నర్ ద్వారా రాజకీయాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని, డిసెంబర్ 7న చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.