హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యారంగం అధ్వాన స్థితిలో ఉన్నదని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తంచేశారు. ఎయిడెడ్ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, ప్రైవేట్ వర్సిటీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మండిపడ్డారు. ‘హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్’ నివేదికను బుధవారం బేగంపేటలోని సెస్ కార్యాలయంలో విడుదల చేశారు. సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి, శాంతాసిన్హా, జంధ్యాల తిలక్, ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొని ఈ నివేదికను విడుదల చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా సుఖ్దేవ్ థోరట్ మాట్లాడుతూ.. ధనిక, పేద, కుల పరమైన అసమానతలు పెరిగాయని, సెకండరీ నుంచి ఉన్నతవిద్య వరకు డ్రాపౌట్స్ పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. ముస్లింలు, ఎస్టీలు ఉన్నత విద్యలో వెనుకబడ్డారని విశ్లేషించారు. నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ సంతృప్తికరంగా లేదని, టీచర్ల కొరత వేధిస్తున్నదని, 70% పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గెస్ట్ ఫ్యాకల్టీతో పాఠాలు చెప్పిస్తున్నారని పేర్కొన్నారు. వసతులు లేకపోవడం అత్యంత బాధాకరమని, విద్యార్థినులకు టాయిలెట్లు లేకపోవడం శోచనీయమన్నారు.