హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): వైద్య పరికరాల ఉత్పత్తిలో హైదరాబాద్ ముందువరుసలో ఉన్నదని అమెరికాకు చెందిన హార్లాండ్ మెడికల్ సిస్టం కంపెనీ సీఈవో జాన్ అండర్సన్ పేర్కొన్నారు. క్లస్టర్ల వారీగా ఫార్మా రంగం అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలతో తెలంగాణ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నదని చెప్పారు. భవిష్యత్తులో వైద్య రంగంలో సాంకేతికత వినియోగం ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నారు. వైద్య పరికరాల ఉత్పత్తిలో కీలకమైన మెడికల్ కోటింగ్ ప్రాసెస్ హైదరాబాద్ కేంద్రంగా విస్తరిస్తుందని చెప్పారు. బయోఏషియా సదస్సు కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ఫార్మా రంగంలో టెక్నాలజీ, వైద్య పరికరాల ఉత్పత్తి, వినియోగం, మెడిటెక్ పెట్టుబడులపై నమస్తే తెలంగాణతో మాట్లాడారు.
వైద్య పరికరాల ఉత్పత్తిలో మెడికల్ కోటింగ్ (పూత)కు అత్యంత ప్రాధాన్యం ఉన్నదని హార్లాండ్ మెడికల్ సిస్టం కంపెనీ సీఈవో జాన్ అండర్సన్ చెప్పారు. రోగి ఆరోగ్యాన్ని కాపాడటంలో కోటింగ్ ప్రక్రియ ఎంతగానో సహకరిస్తుందని పేర్కొన్నారు. వైద్య పరికరాలపై సూక్ష్మజీవుల ప్రభావం లేకుండా చేయడం కోటింగ్‌తో సాధ్యపడుతుందని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ఉపకరణాలు, పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. మెడికల్ కోటింగ్ ప్రక్రియలో భాగంగా ఎన్నో విధానాలు అందుబాటులో ఉండగా, ఆధునిక సాంకేతిక వినియోగంలో హార్లాండ్ మెడికల్ సిస్టం కంపెనీ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా మెడికల్ డివైసెస్ హబ్ నుంచి గొప్ప ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయని తెలిపారు. తమ సంస్థ విస్తరణకు హైదరాబాద్‌పై దృష్టి సారించామని చెప్పారు.