హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులు, ఆదివాసీల సంహారాన్ని ఆపాలని, శాంతి చర్చలు నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరడంతో దేశవ్యాప్తంగా ఉన్న 54 సంఘాలతో శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. చర్చలకు ఛత్తీస్గఢ్ సర్కారు సానుకూలంగా స్పందించడాన్ని కమిటీ సభ్యులు అభినందించారు. కేంద్రం కూడా చర్చలకు ముందడుగు వేయాలని కోరారు. కేంద్రం చొరవ తీసుకుంటే సమస్య తప్పకుండా పరిష్కారమవుతుందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణరావు పేర్కొన్నారు
కల్తీ కల్లు తాగి 50 మందికి అస్వస్థత
బాన్సువాడ, ఏప్రిల్ 7 : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో కల్తీ కల్లు తాగి సోమవారం 50 మంది అస్వస్థతకు గురై, 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ క్యాంపు, దుర్కితోపాటు బీర్కూర్ మండలం దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు కలకలం రేపింది. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు హుటాహుటిన బాన్సువాడ దవాఖానకు తరలించారు. విషమంగా ఉన్న వారిని నిజామాబాద్ దవాఖానకు తీసుకెళ్లారు. తొలుత ముగ్గురు, నలుగురు దవాఖానలో చేరగా, ఆ తర్వాత వారి సంఖ్య యాభై దాటిపోయింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి బాధితులను పరామర్శించారు.