IAS | హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కొనసాగుతున్న 11 మంది ఆలిండియా సర్వీసెస్ (ఏఐఎస్) అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. తమ క్యాడర్‌ను మార్చాలని వారు పెట్టుకున్న విజ్ఞప్తిని కేంద్ర అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు ఉండగా, ఏపీ నుంచి ముగ్గురు ఐఏఎస్‌లు ఉన్నారు. వారిని వెంటనే రిలీవ్ చేయాలని ఈ నెల 9న రెండు రాష్ర్టాల సీఎస్‌లకు కేంద్రం లేఖలు పంపింది.
ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, రొనాల్డ్‌రోస్, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్, ప్రశాంతి, ఐపీఎస్‌లు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్నారు. తెలంగాణకు చెందిన ఐఏఎస్‌లు హరికిరణ్, శ్రీజన, శివశంకర్ ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. వారు తమ క్యాడర్‌ను మార్చాలంటూ గతంలో అంతర్గత వ్యవహారాల శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఇవి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండటంతో వెంటనే దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జనవరిలో తీర్పు ఇచ్చింది.
ఈ మేరకు దీపక్ ఖండేఖర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. క్యాడర్ మార్పు కోరుకుంటున్న రెం డు రాష్ర్టాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈ ఏడాది జూలైలో ఢిల్లీకి వెళ్లి కమిషన్ ముందు తమ వాదనలు వినిపించారు. అనంతరం వారి ప్రతిపాదనలను కమిషన్ తిరస్కరించిందని కేంద్రం తాజా లేఖల్లో పేర్కొన్నది. ఈ నెల 16వ తేదీలోగా బదిలీ అయిన రాష్ర్టాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌ల్లో కొందరు ఏపీకి వెళ్లేందుకు సుముఖంగా లేరని తెలుస్తున్నది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తెలంగాణలోనే ఉండేలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.