హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, కొత్త విద్యా సంస్థలను మంజూరు చేయడంలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. నవోదయ విద్యాలయాలు, కరీంనగర్లో ట్రిపుల్ఐటీ ఏర్పాటు, హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి పలు విద్యా సంస్థలను మంజూరు చేయకుండా రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు విద్యా సంస్థల సాధనకు కలిసి రావడంలేదని, కనీసం వారు సొంతంగానైనా ప్రయత్నించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, ఇప్పటికైనా వారంతా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు.
ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడంలేదని వినోద్ విమర్శించారు. 33 జిల్లాలున్న తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలే ఉన్నాయని గుర్తు చేశారు. కొత్త నవోదయ స్కూళ్లు ఏర్పాటైతే గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ 23 నవోదయ విద్యాలయాలతోపాటు కరీంనగర్లో ట్రిపుల్ ఐటీని, హైదరాబాద్‌లో ఐఐఎస్ఈఆర్, ఐఐఎంను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రైతు బీమా పథకంపై వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని వినోద్ ఫైర్ అయ్యారు. ఎల్ఐసీ జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 60 ఏండ్లలోపు వారికే బీమా సౌకర్యం ఉంటుందని, ఆ ప్రకారమే రైతు బీమా పాలసీ చేయించామని చెప్పారు. కేంద్రంతోపాటు పలు రాష్ర్టాల్లో అమలవుతున్న బీమా పథకాలు కూడా 60 ఏండ్లలోపు వారికే వర్తిస్తున్నాయన్న విషయం షర్మిలకు తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు.