హైదరాబాద్, మార్చి 19 (నమస్తేతెలంగాణ) : పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని దొడ్డి దారిన ప్రైవేటీకరించేందుకే ఎలక్ట్రికల్ బస్సులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నదని ఆరోపించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో బుధవారం సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ‘ఆర్టీసీని పరిరక్షిద్దాం- ప్రజా సేవను కొనసాగిద్దాం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీ ఎస్ బోస్, ఎమ్మెల్సీలు కోదండరామ్, నెల్లికంటి సత్యం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీ జీ నరసింహారావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, ఆర్టీసీ జేఏసీ చైర్మన్, ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈ వెంకన్న, కో చైర్మన్, థామస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.