వరంగల్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల అర్హతలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతున్నది. సున్నా మార్కులు వచ్చినా మెడికల్ పీజీ సీటులో చేరవచ్చని కేంద్ర పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఇటీవల నిర్ణయం తీసుకున్నది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతిపాదనల మేరకు కమిటీ సడలింపులు చేసింది. ఇప్పటి వరకు రిజర్వ్డ్ క్యాటగిరీలకు 40, జనరల్ క్యాటగిరీకి 50 పర్సంటైల్ కటాఫ్‌గా ఉన్నది. కరోనా కాలంలో వైద్యసేవలు అందించిన వారికి మేలు చేకూర్చేందుకు అన్న కారణంతో కేంద్రం కటాఫ్‌ను సున్నాకు పరిమితం చేసింది.
దీంతో నీట్ పీజీ పరీక్షకు హాజరైన అందరూ పీజీ కోర్సుల్లో చేరవచ్చు. సున్నా మార్కులు వచ్చినా సీటు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు పరీక్ష నిర్వహించటం ఎందుకనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన వైద్య విద్య పీజీ కోర్సుల్లో అర్హత లేని వారికి సీట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవటం మంచిది కా దని, వైద్య విద్య నాణ్యతపై ప్రతికూల ప్రభా వం పడుతుందని వైద్యనిఫుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు కాలేజీల ఒత్తిడి వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగిలే పీజీ సీట్లను భారీ మొత్తానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అమ్ముకొనేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.