హైదరాబాద్, జూలై14 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ప్రాజెక్టుపై వెల్లువెత్తుతున్న వ్యతిరేక స్వరాలను మభ్యపెట్టేందుకు అడుగులు వేస్తున్నది. అందుకు తెలంగాణకే చెందిన కేంద్ర జల్‌శక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరాంను ముందుపెట్టినట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది. ‘గోదావరి జలాలు-నిజాలు-లెక్కలు’ అనే అంశంపై వెదిరె శ్రీరామ్ మంగళవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. లక్డీకాపూల్‌లోని అశోక హోటల్లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో గోదావరి జలాలపై తెలుగు రాష్ర్టాలు ఏవిధంగా ముందుకు సాగాలో వివరించనున్నట్టు ఆయన వెల్లడించారు.
మరోవైపు, నదీ జలాలకు సంబంధించిన అంశాలపై ఇరు రాష్ర్టాలతో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఢిల్లీలో బుధవారం ప్రత్యేక భేటీ ఏర్పాటుచేశారు. సరిగ్గా దానికి ఒకరోజు ముందుగానే వెదిరె శ్రీరామ్ అదే గోదావరి జలాలపై మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటుచేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. వెదిరె శ్రీరాం జల్‌శక్తి శాఖ మాజీ సలహాదారుగానే కాకుండా, నదుల అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్‌గానూ గతంలో కొనసాగారు. మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్న విధంగానే గతంలోనూ మీట్ ది ప్రెస్ నిర్వహించారు. అంతేకాకుండా గోదావరిపై బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెరమీదకు వచ్చిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రితో అనేకసార్లు సచివాలయంలోనూ రహస్యంగా కలిసి మంతనాలు జరిపినట్టు సమాచారం. తాజాగా మళ్లీ గోదావరి జలాలపై మీట్ ది ప్రెస్ ఏర్పాటుచేయడం ఇక కేంద్రమే రంగంలోకి దిగిందనే వాదనకు బలాన్ని చేకూర్చుతున్నది.