హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): జానపద కళాకారుడు దురిశెట్టి రామయ్యను అరుదైన పురస్కారం వరించింది. జానపద సంగీత విభాగంలో తెలంగాణ నుంచి రామయ్య జాతీయ సంగీత నాటక అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెలాఖరులో ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారానికి అందుకోనున్నారు. పెద్దపల్లి జిల్లా గర్రెపల్లికి చెందిన రామయ్య.. పురాతన జానపద సంగీత వాయిద్యాల్లో ఒకటైన కడ్డితంత్రిని వాయిస్తూ దానికి అనుగుణంగా పాటలు పాడటంలో ప్రవీణుడు. ఈ కడ్డితంత్రి వాయిద్య కళను ఆయన 1974 నుంచి ప్రదర్శిస్తూ వస్తున్నారు. చిన్నతనంలోనే తండ్రి నుంచి నేర్చుకున్న ఈ కళను ఉమ్మడి ఏపీలోనే కాకుండా దక్షిణాది రాష్ర్టాల్లో కూడా ప్రదర్శించి అనేక అవార్డులు, సన్మానాలు పొందారు.