హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఎవరితోనూ అసలు చర్చలే జరపొద్దని తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నాయని, అయినా ప్రాజెక్టుపై చర్చలకు రేవంత్ సర్కారుకు తొందరపాటు ఎందుకని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతమని, ప్రభుత్వం అన్నిరకాల చర్చ ల బహిష్కరణకు పిలుపునివ్వాలని డిమాండ్ చేశా రు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సిగ్నల్ మీడియా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నీళ్లు -నిజాలు బనకచర్ల ప్రాజెక్టుపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం సీనియర్ జర్నలిస్ట్ శివారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో నీటిరంగ నిపుణులు, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రిటైర్డ్ ఇంజినీర్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, లక్ష్మీనారాయణ, నైనాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ ఏపీ చేపట్టిన బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టమని హె చ్చరించారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ సమర్పించిన ప్రీ ఫిజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)పై సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, పీపీఏ, జీఆర్ఎంబీ కేంద్ర సంస్థలన్నీ అభ్యంతరాలను వెల్లడించాయని, ప్రా జెక్టు సబబు కాదని, ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని తేల్చిచెప్పాయని గుర్తుచేశాయి. అంతర్రాష్ట్ర అనుమతులను తీసుకున్నాకే అనుమతు లు కోరాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నేతృత్వంలోని ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ) కూడా ఏపీ ప్రతిపాదనలను తిప్పి పంపిందని వెల్లడించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సైతం ప్రాజెక్టుపై చర్చలనేవి అనవసరమని చాలా స్పష్టంగా కేంద్ర జల్‌శక్తి శాఖకు తేల్చి చెప్పారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ మాత్రం ప్రాజెక్టుపై ఏపీతో చర్చలకు ఉత్సా హం చూపడమేమిటని ప్రశ్నించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో పాల్గొనడంపై అ భ్యంతరం వ్యక్తంచేశారు. అనధికార చర్చల్లో పాల్గొనడం ద్వారా తెలంగాణకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలకు ముందుకు పోవద్దని, బేషరతుగా బహిష్కరించాలని దేశ్‌పాండే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
బనకచర్లకు ఒప్పుకుంటే ఉద్యమం తప్పదు: చాడ
ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలను రేవంత్ సర్కా ర్ వ్యతిరేకించాలని, లేదంటే ప్రజలను కూడగట్టి బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి హెచ్చరించారు. బనకచర్ల ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం అధ్యక్షుడు దొంతుల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణకు, ఏపీకి సమన్యాయం పాటించాలని, ఏకపక్షంగా ఏపీకి లబ్ధి చేకూర్చే చర్యలకు పాల్పడవద్దని జస్టిస్ చంద్రకుమార్, విశ్రాంత ఇంజినీరు సత్తిరెడ్డి కోరారు. పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను మరమ్మతులు చేయిస్తున్న కేంద్రం, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు మరమ్మతులు చేయదని, వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీనియర్ జర్నలిస్ట్‌లు బుచ్చన్న, నర్రా విజయ్, ఆర్థిక వేత్త పాపారావు నిలదీశారు. ఏపీతో రాజీపడి తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని నైనాల గోవర్ధన్ హెచ్చరించారు.
బనకచర్లకు ఒప్పుకోం: ఎమ్మెల్సీ అద్దంకి
బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయవద్దని కోరారు. అఖిలపక్ష సమావేశం పెట్టేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. అనంతరం బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలని, ప్రాజెక్టుపై కేంద్రం నిర్వహించే చర్చలను బహిష్కరించాలని, అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయాలని, కేంద్రం సమదృష్టితో రెండు రాష్ర్టాలను చూడాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి, సామాజిక విశ్లేషకుడు పృథ్వీరాజ్, నీటిరంగ నిపుణులు అశోక్, రాము తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకకూ నష్టమే: వీ ప్రకాశ్
బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ర్టానికే కాకుండా బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాలకూ తీవ్ర నష్టమని వీ ప్రకాశ్ హెచ్చరించారు. ఆయా రాష్ర్టాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం కేవలం మేఘా సంస్థ కోసం, డబ్బును దండుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నదని నైనాల గోవర్ధన్ మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రజలే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇకనైనా ప్రాజెక్టును విరమించుకోవాలని వక్తలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.