హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల మధ్య వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్తు బకాయిల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖదేనని చెప్పారు. ఈ వివాదం కేంద్ర విద్యుత్తుశాఖ పరిధిలోకి రాదని, ఏపీ విభజన చట్టం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నదని గుర్తుచేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్తు బకాయిల అంశంలో కేంద్ర ఇంధన శాఖ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
ఏపీ వాదనలు మాత్రమే విని, తెలంగాణ వాదనను పట్టించుకోకపోవడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ విద్యుత్తు సంస్థలకు ఏపీ రూ.12,940 కోట్లు బకాయి పడిందని గుర్తుచేశారు. విద్యుత్తు బకాయిలు రాబట్టుకోవడానికి ఎన్సీఎల్టీ, తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్లను ఏపీ జెన్కో ఉపసంహరించుకొన్నదని తెలిపారు. మరోవైపు ఏపీ జెన్కోపై టీఎస్ జెన్కో, డిస్కం సంస్థలు వేసిన రిట్ పిటిషన్లు రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తొలిరోజుల్లో నాటి ఏపీ సీఎం చంద్రబాబు విభజన చట్టాన్ని ఉల్లంఘించి, తెలంగాణకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారని తెలిపారు. అప్పుడు తెలంగాణ ఎకువ ధరకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.