
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వానిది పోస్ట్‌మ్యాన్ పాత్ర మాత్రమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఇందులో కేంద్రం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నాయి అన్న భావన సరైంది కాదని కాంగ్రెస్ సభ్యుడు భట్టివిక్రమార్కకు చురకలు అంటించారు. గురువారం అసెంబ్లీలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై లఘు చర్చలో భట్టివిక్రమార్క మాట్లాడుతూ, ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారన్న వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కలుగజేసుకుని మాట్లాడుతూ ‘దేశాన్ని నడిపే క్రమంలో రాజ్యాంగం సూచించిన పద్ధతుల్లో కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అందులో కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ఉంటాయి. ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఈ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, అంచనాలు వేసుకుని, స్థానిక సంస్థలు కూడా చక్కగా పనిచేయాలి కాబట్టి ప్రతి రాష్ర్టానికి ప్రతి ఏడాది కొంత నిధులు ఇవ్వాలి అని ఉంటుంది. ఐదేండ్లకు ఒకటేసారి నివేదిక ఇస్తారు. దాన్ని ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులుగా చెప్తాం.
అవి కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు కావు. పన్నుల విషయంలోనూ కొన్నింటిని రాష్ట్రం, కొన్ని కేంద్రం వసూలు చేస్తాయి. కేంద్రం వసూలు చేసే పన్నుల్లోంచి క్రమానుగతంగా ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం నిధులను విడుదల చేయాలన్నది ఇందులోని అంశం. కేంద్రం ఇందులో పోస్ట్‌మ్యాన్‌లా వ్యవహారం చేస్తుందే తప్ప కేంద్ర నిధులనేవి ఏమీ ఉండవు. ‘కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయి.. అవి మాత్రమే ఇస్తున్నారు’ అనేది వాస్తవం కాదు. కేంద్రం ఏదో ఇస్తున్నట్టు.. రాష్ట్ర ప్రభుత్వాలు చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నట్టు.. ఆ భావన సరైంది కాదు. ప్రభుత్వ నిర్వహణలో, సమాజ నిర్వహణలో పంచుకున్న బాధ్యతల్లో కొన్ని పనులు రాష్ర్టాలు, కొన్ని కేంద్రం చేస్తుంది. దాన్ని కేంద్రం నుంచి ఇస్తున్న నిధులే అనడం సరికాదు. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్ కేటాయింపు మాత్రమే. ఇందులో కేంద్రం ఇచ్చేది ఏమీ లేదు. అవి కూడా ఒక రాష్ర్టానికి ఇచ్చి, మరో రాష్ర్టానికి ఇవ్వకపోవడం అనేది ఉండదు. మొత్తం దేశంలోని అన్ని రాష్ర్టాలకూ ఇస్తారు. అందులో మన రాష్ర్టానికి కేటాయింపులు వస్తాయి. అది ఎవరో మెహర్బానీ చేసేది ఏమీ ఉండదు’ అని వివరించారు.