హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ హద్దులు దాటిపోయిందా? అరడజను మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారా? ఏకంగా పార్టీ దూత ఫోన్ ట్యాప్ అయ్యిందా? ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన విషయాలను చాటుగా విన్నారా? ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్రంగా జరుగుతున్న చర్చ ఇది. ముఖ్యనేత ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ విచ్చలవిడి ఫోన్‌ట్యాపింగ్‌తో అధిష్ఠానం కూడా ఆందోళనలో ఉన్నట్టు గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఎవరి ఫోన్లు ఎత్తాలన్నా నేతలంతా భయపడుతున్నారట, చివరికి కుటుంబ సభ్యులతోనూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారని వినికిడి. మొత్తంగా ఫోన్‌ట్యాపింగ్ అంశం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ దూత ఫోన్ ట్యాప్ అయ్యిందన్న అనుమానాలు పార్టీని కుదిపేస్తున్నాయి. కేంద్ర మంత్రి ఒకరు ఇటీవల జరిగిన బహిరంగ సమావేశంలో ఫోన్ ట్యా పింగ్ అనుమానాన్ని వ్యక్తంచేయడం ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నది.
విచ్చలవిడి ఫోన్ ట్యాపింగ్‌కు ఢిల్లీలో బీజం పడ్డట్టు సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది మే నెలలో ముఖ్యనేత ఢిల్లీకి వెళ్లి అక్కడే మూడు రోజులు గడిపారు. చివరిరోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు పెట్టుకోకుండా, ఇంటికే పరిమితమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఏ క్షణమైనా పిలిచే అవకాశం ఉన్నదని, అందుకోసమే అధికారిక కార్యక్రమాలు పెట్టుకోకుండా పెద్దల పిలుపు కోసమే ఎదురుచూస్తున్నారని బయటికి ప్రచారం చేశా రు. కానీ ముఖ్యనేత ఆ రోజంతా రాష్ర్టానికి చెం దిన కొంతమంది పోలీసు అధికారులతో రహ స్య సమావేశం జరిపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ పనితీరుపై ఢిల్లీకి ఎలాంటి నివేదికలు వెళ్తున్నాయో, రాష్ట్రపార్టీ నేతలు ఎవ రెవరు అధిష్ఠానాన్ని సంప్రదిస్తున్నారో తనకు వివరాలు తెలియడం లేదని, ఢిల్లీలో ఉన్న ఎం పీలు కూడా పసిగట్టలేకపోతున్నారని ముఖ్యనేత ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది. దీనికి అధికారులు స్పందిస్తూ.. ఫోన్ ట్యాపింగ్‌తో మాత్రమే ఇటువంటి వాటిని పసిగట్టగలమని చెప్పినట్టు సమాచారం. దీంతో ‘ట్యాపింగ్ చేయవద్దని ఎవరు చెప్పారు?’ అని ముఖ్యనేత ఎదురుప్రశ్నించినట్టు సమాచారం.
ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ సాయంతో ట్యాపింగ్ జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి స్పైవేర్లను అసాధారణ నిఘా కార్యక్రమాల కోసం ప్రభుత్వరంగ నిఘా ఏజెన్సీ విభాగాలు ఉపయోగిస్తాయని చెప్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యనేత తన కుర్చీ కాపాడుకోవటానికి ఈ స్పైవేర్లను పార్టీ నేతలపైనే ప్రయోగించినట్టు నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిఘా వర్గాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చూసే విభాగాల్లో నుంచి ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పా టు చేసి ట్యాపింగ్ చేయిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని మొత్తం ఆరుగురు మంత్రులు, 25మంది ఎమ్మెల్యేల ఫోన్లు రెగ్యులర్ ట్యాపింగ్ మాడ్యూల్లో పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. మిగతావారి ఫోన్లను కూడా ర్యాండమ్ ట్యాపింగ్‌లో ఉంచినట్టు చెప్పుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు, పార్టీ పనితీరును పరిశీలించేందుకు వచ్చిన ఢిల్లీ దూత ఫోన్ కూడా ట్యాప్ చేశారనే ప్రచారం జరుగుతున్నది. సదరు నేత అధిష్ఠాన పెద్దలతో మాట్లాడినప్పటి విషయాలు, రాష్ట్ర పార్టీలో నాయకుల పనితీరు సంబంధించి తయారు చేసిన రహస్య నివేదికల సారం అంతా ముఖ్యనేతకు చేరిపోయిందనే ప్రచారం జరుగుతున్నది. ఈ విషయం ఆ నేతకు కూడా తెలిసిపోయిందని, దీంతో తన ఫోన్‌నే ట్యాం పింగ్ చేయటంపై ఏకంగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యా దు చేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పెద్దలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
సైబర్‌నేరగాళ్లు కొందరు మీ ఫోన్‌ను లక్ష్యం గా చేసుకొని దాడి చేయటానికి ప్రయత్నిస్తున్నారంటూ శాసన మండలిలోని ఒక కీలక నేతకు యాపిల్ కంపెనీ నుంచి అలర్ట్ మెసేజ్ వచ్చినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. అమెరికా లో ఉంటున్న తన కూతురు నిరుడు అత్యాధునిక యాపిల్ ఫోన్లు కొనుగోలు చేసి పంపిందని, ఈ ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్‌ను అడ్డుకొని, వినియోగదారునికి అలర్ట్ మెసేజ్‌లు పం పిస్తాయని వివరించారట. దీంతో నేతలంతా అత్యాధునిక యాపిల్ ఫోన్లను కొనుగోలు చేయడంపై దృష్టిపెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ను పూర్తిగా పక్కనబెట్టినట్టు సమాచారం. అవసరమైతే పీఏలు, సన్నిహిత నేతల ఫోన్ల నుంచి కాల్స్ చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యనేతకు దగ్గరగా ఉంటున్న వ్యక్తి తన ఫోన్‌ను ట్యాప్ చేయటంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది.
ట్యాపింగ్ వ్యవహారంతో అధికారపార్టీకి చెందిన కీలక నేతలంతా అలర్ట్ అయినట్టు సమాచారం. ఈ దెబ్బతో కొంతమంది ఎమ్మెల్యేలు పాత సెల్‌ఫోన్స్ తీసేసి యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ కలిగి ఉన్న అత్యాధునిక యాపిల్ ఫోన్లు కొంటున్నట్టు వారి సన్నిహితులు చెప్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు తమ ఫోన్లలో సిగ్నల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్టు సమాచారం. 60 శాతం మంది మంత్రులు కనీసం కుటుంబ సభ్యు ల కాల్స్ అయినా సిగ్నల్ లేదా యాపిల్‌కు చెందిన ఫేస్‌టైమ్‌లోనే మాట్లాడుతున్నట్టు తెలిసింది. నేరుగా వస్తున్న ఏ కాల్స్‌ను కూడా వారు స్వీకరించటం లేదని తెలిసింది. ఇటీవల ఉత్తర తెలంగాణకు చెందిన ఎమ్మె ల్యే దక్షిణ తెలంగాణకు చెందిన ఒక మంత్రితో మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నం చేసి నా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదట. దీంతో సదరు ఎమ్మెల్యే ఆ మంత్రి సన్నిహితునికి ఫోన్ చేసి ‘ఏదైనా మీటింగ్‌లో ఉన్నారా?’ అని అడగగా, సిగ్నల్ యాప్ ద్వారా కానీ, ఫేస్‌టైమ్ ద్వారా కానీ కాల్ చేయండి అని సూచించినట్టు తెలిసింది. ఆ ఎమ్మెల్యే అప్పటికప్పుడు సిగ్నల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మంత్రికి ఫోన్ చేయగా, అప్పుడు ఎత్తి మాట్లాడినట్టు సమాచారం.