ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 16:26:04

బంగారు ఆభ‌ర‌ణాల బ్యాగ్‌ను క‌నుగొన‌డంలో సీసీటీవీ కెమెరాల సాయం

బంగారు ఆభ‌ర‌ణాల బ్యాగ్‌ను క‌నుగొన‌డంలో సీసీటీవీ కెమెరాల సాయం

హైద‌రాబాద్ : సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్య‌త మ‌రోమారు నిరూప‌నైంది. ఓ వ్య‌క్తి పొగొట్టుకున్న‌ బంగారు ఆభ‌రణాల బ్యాగును క‌నుగొన‌డంలో పోలీసుల‌కు సీసీ టీవీ కెమెరాలు ఎంతో స‌హాయప‌డ్డాయి. న‌గ‌రంలోని చంద్రాయ‌ణ‌గుట్ట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో సోమ‌వారం చోటుచేసుకున్న సంఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. మొహ‌మ్మ‌ద్ ర‌హీం పాషా అనే ఉపాధ్యాయుడు నిన్న సాయంత్రం జ్యూవెల‌రీ దుకాణానికి వెళ్లి ఓ బంగారు నెక్లెస్‌, జ‌త చెవి దిద్దుల‌ను కొనుగోలు చేశాడు. ఈ ఆభ‌ర‌ణాల‌ను బ్యాగులో వేసుకుని ఇంటికి బ‌య‌ల్దేరాడు. తీరా ఇంటికి వెళ్లి చూడ‌గా బ్యాగ్ మాయ‌మైంది. దీంతో ఆందోళ‌న‌కు గురైన పాషా త‌క్ష‌ణ‌మే పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు ఆభ‌ర‌ణాల బ్యాగును సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ద్వారా క‌నుగొని స్వాధీనం చేసుకున్నారు. స‌మాచారాన్ని పాషాకు అంద‌జేసి నేటి మ‌ధ్యాహ్నం స్టేష‌న్‌కు పిలిచారు. పొగొట్టుకున్న బంగారు ఆభ‌ర‌ణాల బ్యాగును సుర‌క్షితంగా అత‌డికి అప్ప‌గించారు. దీనిపై పాషా స్పందిస్తూ... పోలీసుల స‌త్వర స్పంద‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ద‌య‌నీయ ప‌రిస్థితి నుండి పోలీసులు త‌న‌ను బ‌య‌ట‌ప‌డ‌వేసిన‌ట్లుగా పేర్కొన్నాడు.