హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఈ సారి రికార్డుస్థాయిలో 99.73% ఉత్తీర్ణత నమోదయ్యిం ది. జాతీయంగా ఇదే రెండో అత్యధిక ఉత్తీర్ణత. రాష్ట్రం నుంచి బాలురు 99.6%, బాలికలు 99.80% పాస్ అయ్యారు. మన రాష్ట్రం నుంచి 146 పాఠశాలలకు చెం దిన మొత్తం 8,477 మంది ఫీజు చెల్లించగా, 8,443 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
వీరిలో 8,420 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. రాష్ర్టాలవారీగా తీసుకుంటే మేఘాలయ 100%, తెలంగాణ 99.73%, ఏపీ 99.51%, కేరళ 99.32% ఉత్తీర్ణతతో టాప్ నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించారు. జాతీయంగా 16,92,794 మంది పరీక్షలు రాయగా 14,96,307 మంది ఉత్తీర్ణులయ్యారు. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు 99.83% ఉత్తీర్ణులయ్యారు. 51,521 మంది పరీక్ష రా యగా 51,433 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 99.86%, బాలురు 99.80% ఉత్తీర్ణులయ్యారు.