హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో విచారించేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో భాగంగా కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. బుచ్చిబాబు ఫోన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆమెను విచారించాల్సి ఉన్నదని పేర్కొన్నది. దీనిపై శుక్రవారం జస్టిస్ కావేరి బవేజా విచారణ జరిపారు. కవితను జైలులో విచారించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ప్రశ్నించే ఒక్కరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని, ఇతర నిబంధనలన్నీ పాటించాలని స్పష్టం చేశారు.