వరంగల్లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్స్ స్కామ్ విచారణలో భాగంగా దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సైతం ఉన్నది. గురువారం యూనివర్సిటీ పరిపాలన భవనానికి చేరుకొన్న సీబీఐ అధికారులు.. ధ్రువపత్రాలను పరిశీలించారని వదంతులు వినవచ్చాయి.
సీబీఐ అధికారులు కాళోజీ వర్సిటీలో తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా వారికి చుక్కెదురైంది. ఈ విషయమై యూనివర్సిటీ అధికార వర్గాలను వివరణ కోరగా ఇప్పటివరకు ధ్రువపత్రాల పరిశీలన, అసలు, నకిలీ ధ్రువీకరణ అంశాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఇక్కడ ఎలాంటి తనిఖీలు, సోదాలు జరగడం లేదని వారు స్పష్టం చేశారు.