హైదరాబాద్ : ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుంచి వివరణ తీసుకున్నారు. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటిసు ఇచ్చిన అధికారులు ఆదివారం ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఇక్కడి ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆరుగురు సీబీఐ అధికారులతో కూడిన బృందానికి రాఘవేంద్ర వస్త నాయకత్వం వహించారు. సాయంత్రం 6 గంటల వరకు వివరణ తీసుకున్నారు.
మహిళను విచారిస్తున్న సందర్భంలో మహిళా సీబీఐ అధికారి కూడా తమ వెంట తీసుకువచ్చారు. సీబీఐ అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా సహకరించాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీ శ్రేణులు ఎవరూ ఇంటికి రావొద్దని కవిత సూచించడంతో ఆమె ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. మీడియా ప్రతినిధులు మినహా మరెవరూ ఆ ప్రాంతంలో కనిపించలేదు.