హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కొన్ని గ్రానైట్ కంపెనీల ఎగుమతుల్లో అక్రమాలు జరిగాయని ఓ బీజేపీ నేత చేసిన ఫిర్యాదుతో సీబీఐ విశాఖపట్నం యూనిట్ అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన కంపెనీలు విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేసే సమయంలో అక్రమాలు జరిగాయని, వాటిలో రైల్వే, పోర్టుల అధికారులకు కూడా సంబంధం ఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మైనింగ్ అంశం రాష్ట్ర పరిధిలోనిది. రాష్ట్ర ప్రభుత్వం కోరితే లేదా న్యాయస్థానం ఆదేశిస్తేనే సీబీఐ విచారణ చేయాలి. కానీ, ఈ కేసులో సీబీఐ విచిత్రమైన కోణంలో ముందుకు వచ్చింది. కేంద్ర పరిధిలో ఉండే ఎగుమతులు, పోర్టుల్లో ఇక్కడి గ్రానైట్‌కు సంబంధించి అవకతవకలు జరిగాయని కేసు నమోదు చేసింది. అది కూడా బీజేపీ నేత ఫిర్యాదు ఆధారంగా నమోదు చేయడం గమనార్హం. కేంద్ర సర్కారు కొత్తకోణంలో ఈ వ్యవహారంలోకి చొరబడుతున్నదని రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన శ్వేత ఏజెన్సీ, ఏఎస్ షిప్పింగ్, జేఎం బాక్సి అండ్‌కో, మైథిలి ఆదిత్య ట్రాన్స్పోర్ట్, కేవీకే ఎనర్జీ, అరవింద్ గ్రానైట్స్, శాండియ ఏజెన్సీస్, పీఎస్ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్, వెంకటేశ్వర లాజిస్టిక్స్ కంపెనీల పేర్లను సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పేరాల శేఖర్‌రావు ఫిర్యాదుతో రంగంలోకి సీబీఐ
విదేశాలకు గ్రానైట్ ఎగుమతుల సమయంలో జరిగిన అవకతవకలకు రైల్వే, పోర్టుల అధికారులు సహకరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన బీజేపీ మాజీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పేరాల శేఖర్‌రావు గత ఏడాది జనవరిలో ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలోనూ ఇదే వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్టు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సైతం ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈడీ అధికారులు ఆయా కంపెనీల నుంచి పలు పత్రాలు తీసుకెళ్లి తనిఖీ చేసినా, ఏమీ తేల్చలేకపోయారు. ఆ కేసు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా మరో బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేయడంతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేయడంపై చర్చ జరుగుతున్నది. సీబీఐ నేరుగా ఈ వ్యవహారంలోకి వచ్చేందుకు వీలులేక, బీజేపీ నాయకుల ఫిర్యాదులను అవి కూడా ఎగుమతులు, సరఫరాలకు సంబంధించిన అధికారులను సాకుగా చూపుతూ కేసులు నమోదు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.