కాగజ్‌నగర్, జూన్ 28: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం అందెవెళ్లి పెద్దవాగులో శుక్రవారం పశువులు కొట్టుకుపోయాయి. తిరిగి ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరాయి. అందెవెళ్లికి చెందిన పశువుల కాపరి కేశవేణి మల్లేశ్ 30కి పైగా మూగజీవాలను మేపేందుకు అడవికి బయలుదేరాడు. పెద్దవాగు దాటించి జగన్నాథ్‌పూర్ వైపు తోలుకెళ్తుండగా ఒక్కసారిగా వాగు వరద ఉధృతి పెరిగింది. దీంతో పశువులు సుమారు 100 అడుగుల దూరం దాకా కొట్టుకుపోయాయి. వరదలో ఈదుకుంటూ పెద్దవాగు బ్రిడ్జి పిల్లర్లు, ఇసుకమేటల సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేరాయి. దీంతో పశువుల కాపారితోపాటు వాటి యాజమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాజెక్టు నీటిని వదిలారా? లేదా అనేది తహసీల్దార్‌తోపాటు పోలీసు అధికారులు స్పష్టం చేయలేకపోతున్నారు. ప్రాజెక్టు నీటిని వ దిలితే తమకు సమాచారం ఉంటుందని యజమానులు చెప్తున్నారు. ఇటీవలే ఈవాగు అప్రోచ్ రోడ్డు పూర్తిచేసి రాకపోకలు ప్రారంభించారు. ఆ వంతెన పైనుంచి భారీ వాహనాలు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.