అయిజ (జోగులాంబ గద్వాల): అంతర్ రాష్ట్ర పశుబల ప్రదర్శన పోటీలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరుగుతున్నాయి. శనివారం పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాలపళ్ల విభాగం పశుబల ప్రదర్శన పోటీలు జరిగాయి. పోటీలకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 16 జతల వృషభరాజములు తరలొచ్చాయి. పోటీలను అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, బహుమతుల దాత, శ్రీరామ ట్రేడర్స్ అధినేత యుగంధర్ రెడ్డిలు ప్రారంభించారు.
జోరుగా జరుగుతున్న పశుబల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి రైతులు అయిజకు తరలొచ్చారు. ప్రతి ఏటా జరుగుతున్న పశుబల ప్రదర్శన పోటీలు నడిగడ్డలో ఎక్కడ జరుగని విధంగా పెద్ద ఎత్తున జరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వృషభరాజముల యజమానులకు నగదు బహుమతులను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, రైతులు, భక్తులు పాల్గొన్నారు.
తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పశుబల ప్రదర్శన పోటీలో విజేతలను ఆలయ కమిటీ ప్రకటించింది. కర్నూల్ జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బీఎల్కే బుల్స్ వృషభరాజములు మొదటి, రెండు స్థానాల్లో నిలవగా, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం కవచుపాడు గ్రామానికి చెందిన వడ్డెమాన్ ఆంజనేయరెడ్డి వృషభరాజములు మూడో స్థానంలో నిలువగా, నంద్యాల జిల్లా దోర్నిపాడు గ్రామానికి చెందిన బత్తుల బ్రదర్స్ వృషభరాజములు నాలుగో స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా సంజాముల మండలం ముక్కమల్ల గ్రామానికి చెందిన ముసాని చంద్రశేఖర్ రెడ్డి వృషభరాజములు ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాయని ఆలయ కమిటీ తెలిపింది.
తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం న్యూకేటగిరి పశుబల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ తెలిపింది. పోటీలకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వృషభరాజములు తరలిరానున్నట్లు పేర్కొంది.