కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 16 : జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని మంజీరా హాస్టల్ వంటశాలలో పాత్రలపై ఓ పిల్లి కూర్చొని పెరుగు తాగిన వీడియో సోషల్ మీడియాలో మంగళవారం చక్కర్లు కొట్టింది. ఈ ఘటనను ‘ఎక్స్’లో గమనించిన మాజీ మంత్రి కేటీఆర్ స్పందించి ‘వర్సిటీ హాస్టల్స్‌లో ఎలుక కోసం పిల్లి వెదుకుతున్నది’ అని ట్వీట్ చేశారు.
దీంతో ఇన్నాళ్లూ వర్సిటీ హాస్టల్స్ విద్యార్థుల ఫిర్యాదులను పట్టించుకోని జీహెచ్ఎంసీ ఫుడ్‌సేప్టీ అధికారులు, హాస్టల్ అధికారులు హడావుడి చేశారు. మంగళవారం సాయంత్రం ఫుడ్‌సేఫ్టీ అధికారులు హాస్టల్స్‌లో పర్యటించి ఆహార నాణ్యత, వంటశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు శుచీశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చట్నీలో ఎలుకతో చర్చనీయాంశం
ఇటీవల జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ బ్రాంచ్ హాస్టల్లో చట్నీలో ఎలుక పడింది. అందులోంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా విద్యార్థులు గమనించి వీడియో తీసి వర్సిటీ హాస్టళ్ల దుస్థితిని బయట ప్రపంచానికి చూపించారు. ఈ ఘటనతో వర్సిటీ హాస్టళ్లలోని శుచీశుభ్రత చర్చనీయాంశమైంది.
జేఎన్టీయూహెచ్ హాస్టళ్లలో నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని, వంటశాలలు పరిశుభ్రంగా లేవని, వంటవారు పరిశుభ్రతను పాటించడం లేదని, ఆహారంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. స్పందన లేకపోవడంతో హాస్టల్ బయట బైఠాయించి నిరసన కూడా తెలిపారు. విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో వర్సిటీ రిజిస్ట్రార్, కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్ అధికారులంతా కలిసి హాస్టళ్లలో పర్యటించి విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు.
వంటశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వంటలు చేస్తున్నప్పుడు గ్లౌజ్‌లు ఉపయోగించాలని, పురుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులకే వంటశాలలో పాత్రలపై పిల్లి దర్జాగా కూర్చొని పెరుగు తాగిన ఘటనతో కిందిస్థాయి సిబ్బంది అధికారుల ఆదేశాలను ఏమాత్రం పాటించడం లేదని మరోసారి తేటతెల్లమైంది. తమ సమస్యపై వెంటనే స్పందించిన కేటీఆర్‌కు వర్సిటీ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థులు తిన్న తరువాతనే జరిగింది..
ఈ విషయంపై వర్సిటీ మంజీరా హాస్టల్ వార్డెన్ దుర్గాకుమార్‌ను వివరణ కోరగా విద్యార్థులకు భోజనం అందించిన తర్వాతనే వంటశాలలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల గిన్నెపై పిల్లి కూర్చున్నదని చెప్పారు. పెరుగు మాత్రమే తాగడాన్ని గుర్తించి దాన్ని పారబోశామని చెప్పారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.