హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఇంటింటి సర్వే పత్రాలు రోడ్డుపై కనిపించటం ఏంటని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనకు సంబంధించిన సమగ్ర రిపోర్టును అందించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పత్రాలు ఇటీవల తార్నాక రోడ్లపై ఎక్కడపడితే అక్కడ కనిపించాయి.
అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతున్నాయి. ఈ విషయం బీసీ కమిషన్ దృష్టి వెళ్లడంతో చైర్మన్ నిరంజన్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఆ దరఖాస్తులు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, మేడ్చల్ మలాజ్గిరికి చెందినవిగా అధికారులు వెల్లడించారు. ఘటనపై సమగ్ర రిపోర్ట్ అందించాలని జవహర్నగర్ మున్సిపల్ కమిషనర్, మేడ్చల్ కలెక్టర్కు లేఖ రాశారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి సైతం తీసుకెళ్లారు.