యాదగిరిగుట్ట, ఆగస్టు 31: రాష్ట్రంలో కులగుణన నిర్విఘ్నంగా సాగాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నట్టు బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ తెలిపారు. శనివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఈవో భాస్కర్రావు ఆయనకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణన చేపట్టాలని తీర్మానం, ఇంటింటి సర్వే ప్రశ్నావళి రూపొందించి ప్రభుత్వానికి అందజేసే కార్యాచరణలో భాగస్వామ్యం కావడం సంతృప్తినిచ్చిందన్నారు.
బీసీ కుల సర్వే పూర్తయ్యాక వచ్చిన సమగ్ర సమాచారంతో వారి జీవన ప్రమాణాల్లో మెరుగుదల తీసుకురావాల్సిన బాధ్యతను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. పదవీ కాలం ముగియడంతో కులగణనపై తుది నివేదిక ఇవ్వకుండానే నిష్క్రమించడం కొంత ఆవేదన కలిగిస్తున్నదని చెప్పారు.