Cancer | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): దేశంలో క్యాన్సర్ మహమ్మారి నానాటికీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత ఐదేండ్లలో ఈ కేసులు 11.55% పెరిగినట్టు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) ప్రకటించింది. ఇదే సమయంలో ఈ కేసుల సంఖ్య తెలంగాణలో 10%, ఏపీలో 9% పెరిగినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 13,92,179 క్యాన్సర్ కేసులు నమోదవగా.. 2024లో అవి 15,33,055కి పెరిగినట్టు తెలిపింది. ఇదే సమయంలో ఈ కేసుల సంఖ్య తెలంగాణలో 47,620 నుంచి 52,334కు, ఏపీలో 70,424 నుంచి 76,708కి పెరిగినట్టు స్పష్టం చేసింది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య 22,18,694కు చేరుకుంటుందని అంచనా వేసింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రొగ్రామ్ (ఎన్సీఆర్పీ) డాటా ప్రకారం.. దేశవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రూ.2-3 వేల ఖర్చుతో స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించే వీన్నప్పటికీ చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో 40 ఏండ్లు పైబడిన వారంతా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించొద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి..
పొగ తాగడం, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారం, మానసిక ఒత్తిడి సైతం క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదయ్యేవి. మన దేశంలోని ప్రతి 28 మంది మహిళల్లో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా మహిళలంతా వెంటనే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం, జీవన శైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
– డాక్టర్ గీత నాగశ్రీ, ఆంకాలజిస్ట్ (కేర్ హాస్పిటల్)