మహబూబ్‌నగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాలుష్యం వెదజల్లే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దంటూ ఆందోళనకు దిగిన రైతులపై ప్రభుత్వం ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు తరలించింది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు శిష్యులకు చెందిన ఇథనాల్ కంపెనీ నిర్మాణ పనులు చేపడుతుండటంతో బుధవారం వందలాది మంది రైతులు తిరగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై గాయత్రి ఇథనాల్ కంపెనీ సీఈవో మంజునాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం 40 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిపై అటెంప్ట్ మర్డర్తోపాటు మరో 17 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో 12 మందిని రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ ఘటనతో సంబంధం లేని నాగర్‌కర్నూల్ సబ్ జైలర్ నాగరాజుపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. పెద్ద ధన్వాడకు చెందిన సబ్ జైలర్ నాగరాజుకు ఇథనాల్ ఫ్యాక్టరీ సమీపంలో పొలం ఉన్నది. దీంతో ఆయనను కూడా రైతుగా భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘటన జరిగిన బుధవారం రాత్రి నుంచి పోలీసులు గ్రామాల్లోకి చొరబడి కనబడిన వాళ్లందరినీ చితకబాదుతూ డీసీఎంలు, మినీ ఆటోల్లో తరలించారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. ముందుగా వారందరినీ రాజోళి పోలీస్‌స్టేషన్‌కు, ఆ తర్వాత మానవపాడు, గట్టు, అయిజ పోలీస్స్టేషన్లకు తిప్పుతూ రాత్రంతా చిత్రహింసలకు గురిచేసినట్టు అరెస్టయిన రైతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు వారం రోజుల నుంచి ప్రయత్నిస్తుండగా, బుధవారం పెద్ద సంఖ్యలో రైతులు తరలివెళ్లి పనులను అడ్డుకున్నారు. కాగా, ఈ దాడి ఘటనకు కారణం ఒక పోలీసు అధికారి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఏపీకి చెందిన టీడీపీ నేతలు, పకడ్బందీగా రచించిన ప్రణాళిక ప్రకారమే.. సదరు పోలీసు అధికారి గ్రామాల్లోకి వెళ్లి.. ‘ఫ్యాక్టరీ జోలికి వెళ్లొద్దు.. మీ అంతు చూస్తాం.. కేసులుపెట్టి బొక్కలో తోస్తాం.. గ్రామం దాటి బయటికి రావద్దు..’ అని రైతులను బెదిరించినట్టు పలువురు రైతులు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. పచ్చని భూములను కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే బుధవారం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకునేందుకు వెళ్లినట్టు చెప్పారు.
రాజోళి మండలంలో ఇథనాల్ కంపెనీ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నప్పటినుంచే రైతులు ఆందోళన చేస్తున్నారు. మూకుమ్మడిగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. అయితే, అన్ని పార్టీల నేతలు వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కట్టనివ్వబోమంటూ మాజీ ఎమ్మెల్యే సంపత్.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబుతో హామీ ఇప్పించారు. ఏం జరిగిందో ఏమో కానీ మూడు నెలల తర్వాత మళ్లీ ఫైలు కదలడం ప్రారంభమైంది. కాగా కంపెనీ నిర్మాణం చేపట్టేందుకు ఈసారి పక్కా ప్రణాళికతో వస్తామని కంపెనీ ప్రతినిధులు అప్పట్లో చాలెంజ్ చేశారు. కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ జబ్బల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న ఆయన ఈ కంపెనీ కోసం అనుమతులు తెచ్చుకున్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ కంపెనీ నిర్మాణం తెరపైకి వచ్చింది. ఆదివారం ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో తాత్కాలిక షెడ్ల నిర్మాణం ప్రారంభించారు. సోమవారం ఏకంగా సిబ్బం ది ఉండేందుకు కంటైనర్‌ను రప్పించారు. పనులను ఎవరూ అడ్డుకోకుండా ఉండేందుకు 30 మంది బౌన్సర్లను ఏర్పాటుచేశారు. అక్కడ ఏదో జరుగుతున్నదని రైతులు అనుమానిస్తున్న సమయంలోనే.. ఓ పోలీస్ అధికారిని గ్రామాల్లోకి పంపించి బెదిరించడంతో రైతులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. కాగా, రైతుల తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో లగచర్ల ఘటన మరువక ముందే, జోగుళాంబ గద్వా ల జిల్లాలో మరో ఫ్యాక్టరీపై రైతులు తిరుగుబాటు ప్రకటించారు. లగచర్లలో కూడా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపించింది. అదేవిధంగా రాజోళి రైతులపై కూడా నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి జైలుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం రాజోళి మండలంలోని చుట్టుపక్కల గ్రామాలన్నీ నిర్మానుషంగా మారాయి. ఉన్న కొద్ది మందీ రాత్రయితే చాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
రాజోళి మండలంలో జరిగిన ఘటనపై జీఆర్ఎఫ్ కంపెనీ సీఈవో మంజునాథ్ ఇచ్చిన ఫిర్యాదు కాపీని పోలీసులే తయారుచేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కంపెనీ ప్రతినిధులు తమపై జరిగిన దాడి గురించి రైతుల పేర్లతో సహా ఫిర్యాదులో పేర్కొనడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. అసలు రైతుల పేర్లే తెలియని ఈ కంపెనీ యజమానులు తమ ఫిర్యాదులో దాదాపు 40 మంది పేర్లను పేర్కొనడం గమనార్హం. తమపై మారణాయుధాలు ఇతరాత్రా వాటితో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీ సీఈవో బుధవారం రాత్రి ఫిర్యాదు చేస్తే, గురవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఫిర్యాదు ఇచ్చినట్టు ఎఫ్ఐఆర్లో నమోదుచేయడం అనుమానాలకు తావిస్తున్నది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులను ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయలేదని బుకాయించారు. చివరకు రైతులను అనేక పోలీసుస్టేషన్లో మార్చుతూ ఉదయం గద్వాల కోర్టులో హాజరుపరిచారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ యజమాని ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన పారిశ్రామికవేత్త. గతంలో వైఎస్సార్సీపీలో ఉండి కంపెనీకి అనుమతులు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఫ్యాక్టరీ యజమాని, టీడీపీ నేత శ్రీనివాస్ జబ్బల ఆంధ్రప్రదేశ్ కురబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు సీఎం కావడం, తెలంగాణలో కూడా చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి అధికారంలోకి రావడంతో తన పని సులువైందని కంపెనీ యజమాని రైతులతో అన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ విషయం తెలియని ఇక్కడి అధికార పార్టీ నేతలు తొలుత ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకించారు. రైతులను ఏకంగా ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు వద్దకు తీసుకెళ్లి, ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వబో మంటూ హామీ కూడా ఇప్పించారు. అయితే, హైదరాబాద్ నుంచి కంపెనీ ప్రతినిధి చక్రం తిప్పడంతో అధికార పార్టీ నేతలు ప్లేటు ఫిరాయించారు. చివరకు రైతులపై అటెంప్ట్ మర్డర్, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించారు. రాజోళి రణరంగం కాకముందే ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హెచ్చరించారు.
రాజోళి, జూన్ 5: జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీని ఏర్పాటుచేయవద్దంటూ రైతు లు ఆందోళనకు దిగిన నేపథ్యంలో పలువురు రైతులు గాయపడ్డారు. తమపై దాడిచేసిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం రాజోళి పోలీసుస్టేషన్లో మరియమ్మ, కురువ కృష్ణ, కురువ లింగన్న ఫిర్యాదుచేశారు. ఇథనాల్ కంపెనీ యాజమాన్యం, సిబ్బంది రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు రెచ్చగొట్టడం వల్లే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసులు నమోదుచేస్తామని ఎస్సై జగదీశ్ తెలిపారు.
ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి నేపథ్యంలో కంపెనీ సీఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 59/2025 కింద 40 మందిపై కేసులు నమోదుచేసి, 12 మందికి రిమాండ్‌కు తరలించినట్టు రాళోళి ఎస్సై జగదీశ్ మీడియాకు వెల్లడించారు. ఆయా రైతులపై క్రిమినల్ లా సవరణ చట్టం-2013 కింద యూ/19(2), 191(3), 329(3), 329(4), 324(5), 126(ఎఫ్), 326(జీ), 115(2), 118(1), 121(1), 132, 126(2), 109.61(2) 351(1), 352ఆర్/డబ్ల్యూ, 199 బీఎన్ఎస్-2023, సెక్షన్ 7(0 కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు. 40 మందిని కస్టడీలోకి తీసుకోగా అందులో 12 మంది ఆందోళనకారులను గుర్తించి అటెంప్ట్ మర్డర్ కేసు కింద రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. రిమాండ్‌కు తరలించినవారిలో కురువ నరసింహులు, నరసింహులు, భరత్‌కుమార్, చిన్న నాగేంద్ర, నల్లబోతు కాటం, పరశురాముడు, శివ గౌడు, సూర్యప్రకాశ్, తిప్పారెడ్డి, భీమన్న, మనోహర్, ఏసన్న అనే వ్యక్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. వీరిని గద్వాల కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించిందని, అనంతరం కోర్టు ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించినట్టు ఎస్సై వెల్లడించారు. అలాగే జయరామిరెడ్డి, రెహమాన్, నాగరాజు (నాగర్‌కర్నూల్ సబ్‌జైలర్), కుర్వ చెన్నయ్య, డీలర్ నాగరాజు, కుర్వ నారాయణ, కుర్వ శివన్న, వీరన్న, రాజేంద్రప్రసాద్, కేఎంఎస్ శ్రవణ్, బజారి, సాగర్, ఎంపగొడ్ల పౌలు, తమ్మలి రాగప్ప, సతీశ్, ధర్మారెడ్డి, గోకారి, రాజు, దేవవరం, హన్మంతురెడ్డి, రాజు, కుమ్మరి మల్లేశ్, హుస్సేన్, అలెగ్జాండర్, మాణిక్యం, యువరాజ్, మాడెపోగు రోహిత్, వినోద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇథనాల్ కంపెనీ సిబ్బంది దౌర్జన్యం చేసిండ్రు. చేస్తున్న పనులను అడ్డుకోవడానికి గేటు దాటి వస్తే తంతమన్నరు. ఆడ బౌన్సర్లను కావలి పెట్టిండ్రు. కంపెనీ వద్దని రిలే దీక్షలు చేసినం. కట్టనియ్యమని సార్లు హామీ ఇచ్చిండ్రు. మల్ల రాత్రికి రాత్రే వాహనాల్లో సామాన్లు దింపి పనులు మొదలు పెట్టిండ్రు. అడ్డుకోడానికి పోతే మా మీదనే దాడి చేసి కొట్టి మావోళ్లపైనే కేసులు పెట్టిర్రు. ఇది న్యాయమేనా? మేం బతకే మార్గం సూపెట్టాలె గాని మా బతుకులు నాశనం చేసే కంపెనీలు మాకెందుకు? సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలె.
-దేవవరం, పెద్ద ధన్వాడ
ఇథనాల్ కంపెనీ నిర్మాణ ప్రాంతంలో బుధవారం జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు ఎక్కడ దొరికినోళ్లను అక్కడే పట్టుకుంటున్నారు. నా తమ్ముడు కూతురి సర్టిఫికెట్ల కోసం రాజోలికి వెళ్లి తిరిగి వస్తుంటే ఆపి పట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్లిండ్రు. గొడవ జరుగుతున్నప్పుడు నా తమ్ముడు లేనే లేడు. తండ్రిని స్టేషన్‌కు పట్టకుపోవడంతో పిల్లలు ఏడుస్తున్నరు. కంపెనీ వద్దని పోరాటం చేయడం న్యాయ మే కదా. ప్రభుత్వం న్యాయం చేయాలి. నా తమ్ముడిని వదిలిపెట్టాలి. మేం రోజూ పని చేసుకుంటేగానీ పూట గడవదు.
– కృష్ణ, పెద్ద ధన్వాడ, జోగుళాంబ గద్వాల జిల్లా
కాలుష్యం వెదజల్లే కంపెనీ వద్దని మేం ఆరు నెలలుగా దీక్షలు చేశాం. కంపెనీని రద్దు చేస్తామని, కట్టనీయబోమని అధికారులు, నాయకులు హామీ ఇచ్చిండ్రు. రాత్రికి రాత్రే యంత్రాలు.. ప్రైవేట్ గూండాలను దింపారు. పనులు మొదలుపెట్టాలని చూశారు. వద్దని చెప్పడానికి వెళ్లిన మాపై దాడులు చేశారు. గాయపర్చారు. అందుకే మేం 12 ఊర్ల మందిమి కదం తొక్కి కదిలాం. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచించాలి.
– యోసన్న, పెద్ద ధన్వాడ, జోగుళాంబ గద్వాల జిల్లా
అయిజ, జూన్ 5: పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దంటే అరెస్టులు చేస్తారా? అంటూ పలు గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో 12 గ్రామాలకు చెందిన రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కంపెనీ యాజమాన్యం చడీచప్పుడు కాకుండా, బౌన్సర్లను పిలిచిమరీ పనులు మొదలుపెట్టేందుకు ప్రయత్నించడంతోనే కడుపుమండి ఇథనాల్ కంపెనీ స్థావరాలపై దాడులు చేయాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. తమపై అక్రమ కేసులు బనాయించినా, రిమాండ్‌కు తరలించినా ఇథనాల్ కంపెనీ పూర్తిగా రద్దయ్యే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఫ్యాక్టరీ వస్తే ఇక్కడి పచ్చని పొలాలు విషమయం అవుతాయని, భూగర్భ జలాలు కలుషితమవుతాయని చెప్పారు. తమ గోడు చెప్పుకున్నా సర్కారు, అధికారులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులను ఉసిగొల్పి తమపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కంపెనీని ఏర్పాటు చేయొద్దంటూ రైతులు నిరసనలు చేస్తుంటే అకారణంగా కేసులు పెట్టడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వంలోని కొందరి ప్రోద్బలంతోనే రైతులపై కేసులు నమోదుచేశారని, వీటిని ఎలాగైనా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. కంపెనీ స్థావరాలపై దాడులు చేశారనే నెపంతో రైతులను చిత్రహింసలు పెట్టి, వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారని ఆరోపించారు.
గద్వాల, జూన్ 5 : రాజోళి మండలంలోని పలు గ్రామాలు భయం నీడలో ఉన్నాయి. గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు దండయాత్ర చేసిన నేపథ్యంలో పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారోనన్న టెన్షన్ నెలకొన్నది. ఇప్పటికే పలువురిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. ఇంకా ఎంతమందిని జైలుకు పంపుతారోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో పలు గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. ఇప్పటికే కేసుల భయంతో పలువురు రైతులు గ్రామాలను విడిచి ఇతర గ్రామాలకు వెళ్లినట్టు సమాచారం. కాగా గురువారం మీడియా ఎదుట రాజోళి ఎస్సై జగదీశ్ మాట్లాడిన మాటలు రైతులను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. మహిళలు కారం పొడి తీసుకొచ్చి నిరసనలో పాల్గొన్నారంటూ ఎస్సై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన పోలీసులు.. ఫ్యాక్టరీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆందోళనలో పాల్గొనని వారి పేర్లను సైతం ఉద్దేశపూర్వకంగా ఎఫ్ఐఆర్లో నమోదుచేశారని ఆరోపించారు. కాగా, పెద్దధన్వాడ ఘటనపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలను ప్రజలు ఆసక్తిగా చదవడం విశేషం.