హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుడ్ని అరెస్టు చేసిన ఘనత తెలంగాణ పోలీసులకు దక్కింది. అసలు అంశాన్ని పక్కదారి పట్టించిన పోలీసులు, బాధితుడినే నిందితుడిని చేసి కటకటాలపాలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిపై, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద ఫిర్యాదు చేయడమే నేరమైంది. ఆ ఎమ్మెల్యే ఫిర్యాదు ఇచ్చేందుకు వస్తున్నడని తెలిసి ఏసీపీ స్టేషన్ నుంచి వెళ్లిపోగా, ఆ వెంటనే స్టేషన్ సీఐ రాఘవేంద్ర కూడా విధుల పేరిట బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. దీనిని ప్రశ్నించినందుకు ఆ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు అర్ధరాత్రి వరకూ న్యాయమూర్తి ముందు హాజరుపర్చకుండా వేధించారు. ఓ ఎమ్మెల్యే ఏకంగా ముఖ్యమంత్రిపై, ఇంటెలిజెన్స్ విభాగం బాస్‌పై ఫిర్యాదు చేసేందుకు రావడం పోలీసులను ఇరుకున పెట్టింది.
ఎక్కడ నేరుగా ఫిర్యాదు తీసుకుంటే.. ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తుందోనన్న భయంతో.. ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు స్టేషన్ విడిచి పోయారని విశ్వసనీయ సమాచారం. కౌశిక్‌రెడ్డితో వాగ్వాదం అనంతరం ఫిర్యాదు తీసుకున్న సీఐ రాఘవేంద్ర.. ఎఫ్ఐఆర్ మాత్రం నమోదుచేయలేదు. పైగా స్టేషన్‌కు వచ్చిన బాధితుడిపైనే తన విధులకు ఆటంకం కలిగించారని ఉల్టా కేసు పెట్టారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేసిన తీవ్రమైన అంశం పక్కదారి పట్టింది. బాధితుడిపై కేసు పెట్టి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని రాష్ట్ర ప్రజానీకం మొత్తం గమనిస్తుండగా.. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తక్షణం కౌశిక్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి.. మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఇదే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ చేస్తూ ఫిర్యాదు చేయగా.. గంట కూడా ఆలస్యం చేయకుండా, మాజీ మంత్రి నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కౌశిక్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై రెండ్రోజులుగా తాత్సారం చేస్తున్నారు. పైగా బాధితుడినే బెదిరించి, లొంగతీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వెంటాడి..వెంబడించి..నార్సింగి వరకు 8 వాహనాల్లో అనుసరించిన పోలీసులు
గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ నుంచి ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు నార్సింగి వెళ్లిన మాజీ మంత్రి హరీశ్‌రావు వాహనాన్ని పోలీసులు వెంబడించారు. ఎనిమిది వాహనాల్లో ఆయనను అనుసరించారు. వేడుక జరిగిన ప్రాంగణంలోనూ భారీగా మోహరించారు. పెద్దసంఖ్యలో పోలీసులు రావడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఉదయం నుంచి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచగా, ఆ తర్వాత కూడా వాహనాలు వెంబడించడాన్ని బీఆర్ఎస్ నాయకులు తప్పుబట్టారు.