హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): పాలమూరు బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో తీవ్రమైన జంతుహింస జరుగుతుందని జంతుహక్కుల సంస్థ ‘పెటా’ ఫిర్యాదు మేరకు ఆ సంస్థపై భూత్పూర్లో కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వెన ల్యాబోరేటరీలో జంతువుల మందులు, పెస్టిసైడ్స్, వైద్య పరికరాల పనితీరును పరీక్షించడానికి అశాస్త్రీయంగా పరిశోధనలు చేస్తున్నారని ‘పెటా ఇండియా’ శాస్త్రవేత్త, రీసెర్చ్ పాలసీ అడ్వైజర్ డాక్టర్ అంజనా అగర్వాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
పాలమూరు బయోసైన్సెస్లో 800 కుక్కలను ఉంచేందుకు కేటాయించిన స్థలంలో సుమారు 1,500 ఉంచడంతో గాయాలపాలవుతున్నాయని తెలిపారు. వాటిపై మందులను ఇంజెక్ట్ చేయడంతో అవి ఇన్ఫెక్షన్కు గురవుతున్నట్టు ఆరోపించారు. దీనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత.. జంతువులపై ప్రయోగాల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ (సీసీఎస్ఈఏ) ప్రాంగణాన్ని తనిఖీ చేయడానికి ఒక అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది.
దీంతో ప్రాంగణాన్ని తనిఖీ చేసిన కమిటీ.. జంతువులను చంపడం, వైకల్యం చేయడం, జంతువులకు కోలుకోలేని నష్టాన్ని కల్గించడం తదితర వాటిపై పలు అభియోగాలు మోపింది. 2021-22 మధ్యకాలంలో రాజస్థాన్ నుంచి కొన్ని జాతులకు చెందిన కుక్కలను తీసుకొచ్చి ప్రయోగాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఏపీవో) కూడా బయోసైన్సెస్ను శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ సీసీఎస్ఈఏకి ఫిర్యాదు చేసింది.