రంగారెడ్డి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఫార్మా భూముల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులపై గ్రీన్ఫార్మాసిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కొన్ని రోజులుగా ఫార్మాసిటీ భూముల రీ సర్వేతోపాటు కంచె ఏర్పాటు పనులను టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు పోలీసుల నిర్బంధం మధ్య చేపడుతున్నారు. తాటిపర్తిలోని 114 సర్వే నంబర్లో సర్వేచేసి ఫెన్సింగ్ వేసేందుకు వచ్చిన అధికారులను కోర్టు స్టే ఉన్నందున సర్వే పనులు చేపట్టవద్దనందుకు సంగెం భిక్షపతి, సంగెం శ్రీనాథ్, సంగెం ఆండాళ్పై గ్రీన్ఫార్మా ఎస్సైతో స్టేట్మెంట్ తీసుకుని సుమోటోగా కేసు నమోదుచేశారు. మేడిపల్లికి చెందిన సర్వే నంబర్ 65లో కూడా సర్వేచేసి కంచె వేసేందుకు వచ్చిన అధికారులను ఆ భూమికి సంబంధించిన గడ్డం మహేశ్, గడ్డం సుందరయ్య అడ్డుకున్నారన్న అభియోగంపై వారిపై కూడా కేసులు నమోదుచేశారు. కోర్టు స్టే ఉన్నప్పటికి తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించటమే కాకుండా ప్రశ్నించిన తమపై కేసులు నమోదు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు.