స్టేషన్‌ఘన్‌పూర్, డిసెంబర్ 25: న్యాయం కోసం నాలుగేళ్లుగా రాజీలేకుండా ఆమె చేసిన పోరాటం ఫలించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినం దుకు ఏకంగా అప్పటి కలెక్టర్‌తోపాటు మరో 11మందిపై కేసులు నమోదు చేయాలని జనగామ జిల్లా కోర్టు ఇటీవల సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు అప్పటి కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ సీఈవో రాంరెడ్డి, ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్‌తోపాటు మొత్తం 12మందిపై స్టేషన్ఘనపూర్ పోలీసులు మంగళవారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వివరాలు ఇలా.. చాడ సునీత తాటికొండలో స్వర్ణ విజయం స్వయం సహాయక గ్రూపు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించేది. ఆమె కేవలం రికార్డులు మాత్రమే రాసేది. అయితే ఏపీఎం కవితతో ఆమెకు అభిప్రాయబేధాలు తలెత్తాయి.
ఉద్దేశపూర్వకంగా ఏపీఎం కవిత తన మీద రూ.20.50 లక్షల అవినీతి ఆరోపణలను మోపి 2020-21లో వీవోఏ బాధ్యతల నుంచి తొలగిం చేలా చేసింది. ఐకేపీ అధికారులు ఏపీఎం ఇచ్చిన సమాచారాన్నే విశ్వసించి సునీత రూ.20.50 లక్షలు కట్టాలని రికవరీ నోటీసులు ఇవ్వడమే కాకుండా మైకులు పెట్టి గ్రామంలో చాటింపు వేశారు. ఈ ఘటనతో సునీత కలత చెందింది. రికార్డులను ఆడిట్ చేయించాలని ఆమె అప్పటి కలెక్టర్ శివలింగయ్యకు విజ్ఞప్తి చేయగా పట్టించుకోలేదు. తనకు న్యాయం చేయాలని ఆమె ఎస్సీ కమిషన్‌ను, హెచ్చార్సీని సంప్రదించింది. 2020 జూన్‌లో కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో గత నెల సునీతకు అనుకూలంగా జనగామ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చి విచారణకు ఆదేశించింది. అప్పటి కలెక్టర్‌తోపాటు మరో 11 మందిపై కేసు నమోదు చేయాలనే కోర్టు ఆదేశాల మేరకు స్టేషన్‌ఘన్‌పూర్ పోలీసులు ఈనెల 23న కేసు నమోదు చేశారు.