చంపాపేట, జూలై 4: తెలంగాణ జర్నలిస్టులపై ఏపీ పోలీసుల ప్రతాపమేంటని బీఆర్ఎస్ రాష్ట్ర నేత పట్లొళ్ల కార్తీక్‌రెడ్డి మండిపడ్డారు. తన చానల్లో ప్రసారం చేసిన వీడియోలు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ఉన్నాయనే సాకుతో జర్నలిస్ట్ వెంకట్రామ్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ పరిధిలోని మాధవనగర్‌లో నివాసం ఉండే జర్నలిస్ట్ వెంకట్రామ్రెడ్డి కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. కేవీఆర్ భార్య విజయలక్ష్మి, ఇతర కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. రాష్ర్టానికి చెందిన జర్నలిస్టును బలవంతంగా తీసుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. కేవీఆర్ భార్య పట్ల అనుచితంగా వ్యవహరించిన ఏపీ పోలీసులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రజలు ఎంతో నిర్భయంగా ఉండేవారని గుర్తు చేశారు. జర్నలిస్ట్ వెంకట్రామ్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా కేవీఆర్‌ను విడుదల చేయించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని, ఇందుకోసం ఏపీ సర్కార్‌పై ఒత్తిడి తేవాలని కోరారు. లేదంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ సరూర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు అంకిరెడ్డి, పార్టీ స్థానిక డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.