హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో పోలీసుల ఘోర నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఆరు హత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)లో కేసు నమోదైంది. ఒక పోక్సో బాధితురాలి కుటుంబానికి నిందితుడి నుంచి ప్రాణాపాయం ఉన్నదని ముందే హెచ్చరించినా, రక్షణ కల్పించడంలో విఫలమైన షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేశ్‌పై ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది.
మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై, బాధితులకు న్యాయం జరుగాలంటూ శనివారం ఫిర్యాదు చేయడంతో ఎన్హెచ్ఆర్సీ ఈ చర్యలు చేపట్టింది. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమేనని, బాధ్యులైన సీఐ, ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది తన ఫిర్యాదులో కోరారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రక్షణ కల్పించడంతోపాటు, భారీ పరిహారం అందించాలని కోరారు. ఈ కేసులో ఎన్హెచ్ఆర్సీ త్వరగా స్పందించి విచారణను వేగవంతం చేయాలని ఆయన కోరారు.