మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌పై చిందులు తొక్కిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌పై కేసు నమోదైంది. తన వార్డులో తనకు కాకుండా మరో కాంగ్రెస్ చోటామోట నాయకుడికి పనులు చేసి పెడ్తున్నారని మాజీ కౌన్సిలర్ తప్పతాగి తాజా కమిషనర్‌ను ఫోన్‌చేసి దుర్భాషలాడాడు. ఈ ఘటనతో కమిషనర్ తీవ్ర మనస్తాపానికి గురై అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన నివాసముంటున్న ఇంటి వద్ద ఉన్న రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అక్కడి పోలీసులు తమ పరిధిలోకి రాదని చెప్పడంతో.. కార్పొరేషన్ కార్యాలయ పరిధిలోని టూటౌన్ పీఎస్‌కు వెళ్తే.. ఇదీ తమ పరిధిలోకి రాదని పంపించారు. చివరకు వన్‌టౌన్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేకుండాపోయింది.
కార్పొరేషన్ ఉద్యోగులు కమిషనర్‌ను వెంట తీసుకెళ్లి కలెక్టర్ విజయేంద్ర బోయికి ఫిర్యా దు చేశారు. ఈ ఘటనను టీజీవో తీవ్రంగా ఖండించింది. ఈలోపు కొందరు కాంగ్రెస్ నేతలు హడావుడిగా పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టి కట్ట రవికిషన్‌రెడ్డి అసలు తమ పార్టీ వాడే కాదని వెల్లడించారు. తర్వాత ఏమైందో ఏమో క్షణాల్లో పోలీసులు అతడిపై స్ట్రాంగ్ కేసు నమోదు చేశారు. దూషణతోపాటు తప్పతాగి కార్యాలయానికి వచ్చి కుర్చీలు ధ్వంసం చేసిన ఘటనలో రవికిషన్‌రెడ్డిని బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. అనంతరం జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు వన్‌టౌన్ సీఐ అప్పయ్య తెలిపారు. అనంతరం బెయిల్ మంజూరైంది.