ఫర్టిలైజర్ సిటీ/పెద్దపల్లి కమాన్, జూలై 17 : బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ దుర్గం శిశధర్గౌడ్ అలియాస్ నల్లబాలును రామగుండం సీసీపీఎస్ పోలీసులు గురువారం పెద్దపల్లి మెజిస్ట్రేట్ ఎదుట మరో కేసులో రిమాండ్ చేశారు. విచారణ జరిపిన జూనియర్ సివిల్ జడ్జి మంజుల రిమాండ్‌ను తిరస్కరిస్తూ కీలక తీర్పు ఇచ్చారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్స్ ఖాతాలో బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేయడంతో శశిధర్‌పై రామగుండం సీసీపీఎస్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. అయితే బుధవారం కరీంనగర్ సీసీపీఎస్, గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో బెయిల్ రాగా, గురువారం రామగుండం సీసీపీఎస్ పోలీసులు మళ్లీ శశిధర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే రిమాండ్ రిపోర్టు సరిగ్గా లేదని, అరెస్టు విషయంలో బంధువులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫున న్యాయవాదులు లలితారెడ్డి, అమృతరావు, జూకంటి భాస్కర్, కుమార్ తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్‌ను తిరస్కరించడంతోపాటు రూ.10వేలతో ఇద్దరు పూచీకత్తులను దాఖలు చేయాలని ఆదేశించారు. అయితే జమానతులు లేకపోవడంతో నల్ల బాలును కరీంనగర్ జైలుకు తరలించారు.