చెన్నూర్ టౌన్, అక్టోబర్ 19 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముత్యాల రవికుమార్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి వివేక్‌పై నిరాధార ఆరోపణలు చేశారని, పత్రికల్లో ప్రకటన ఇచ్చారని మైనింగ్‌శాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 10న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ బాకీకార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముత్యాల రవికుమార్‌గౌడ్ ఆ కార్డు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ, మంత్రి వివేక్‌పై తీరుపై విమర్శలు చేశారు.
‘శాసన సభ ఎన్నికల్లో వివేక్, ఆయన కుమారుడు వంశీకృష్ణను కష్టపడి గెలిపించుకోవడం తాము చేసిన మొదటి తప్పని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇసుక మాఫియా చేస్తున్నారని ఆరోపించారు కదా.. మరి ఇప్పుడు ఇసుక మాఫియాను తమరు అడ్డుకున్నారా? మైనింగ్ శాఖ మంత్రి కూడా తమరే ఉన్నారు కదా’.. అంటూ మంత్రి వివేక్‌ను ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి వివేక్‌కు గుణపాఠం చెప్పాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తమ శాఖపై, సంబంధిత మంత్రిపై నిరాధార ఆరోపణలు చేశారంటూ మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో చెన్నూర్ పోలీస్ స్టేషన్లో రవికుమార్గౌడ్పై ఫిర్యాదు చేయడంతో రవికుమార్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం ఆయనను ఇంటి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు విషయం తెలిపి సాయంత్రం విడుదల చేశారు.