MLA Arikepudi Gandhi | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : బీఆఎర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా 15 మంది ఆయన అనుచరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. కౌశిక్‌రెడ్డితోపాటు గచ్చిబౌలి పోలీసులు సైతం ఎమ్మెల్యే గాంధీ, అతడి అనుచరులపై ఫిర్యాదులు చేయడంతో ఈ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దాడి, హత్యాయత్నం చేసినట్టు కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేయగా, తమ విధులకు ఆటంకం కలిగించినట్టు గచ్చిబౌలి ఎస్ఐ మహేశ్‌కుమార్‌గౌడ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెండు వేర్వేరు ఫిర్యాదులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే గాంధీ సహా 15 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతోపాటు అతడి అనుచరులు ఉప్పలపాటి శ్రీకాంత్, బీ గౌతమ్‌గౌడ్, రాంపల్లి వెంకటేశ్, జీ రాములు, నరేశ్, మేల శివ, రాధిక, మంజుల, చంద్రికగౌడ్, రంగం నాగేందర్‌యాదవ్, డీ వెంకటేశ్ గౌడ్, అశ్రఫ్, రఘునాథ్‌రెడ్డి, మోహన్‌గౌడ్ తదితరులపై 109(1), 189, 191(2), 191(3), 132, 329, 333, 324(4), 324(5), 351(2), రెడ్‌విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు.
తమ విధులకు ఆటంకం కలిగించారంటూ గచ్చిబౌలి ఎస్ఐ మహేశ్‌కుమార్‌గౌడ్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే గాంధీ సహా 15 మందిపై 189, 191(2),191(3), 61, 132, 329,333, 324(4), 324(5), 351(2) రెడ్‌విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో దాడికి పాల్పడిన గాంధీ, అతడి అనుచరులపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడిలో పాల్గొన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుమారుడు పృథ్వీని తప్పించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దాడి ఘటనలో స్పష్టంగా కనిపిస్తున్న పృథ్వీ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పక్షపాత ధోరణి వదిలి వెంటనే దాడికి పాల్పడిన పృథ్వీపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.